కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని.. అమాయకులను దేశద్రోహులంటూ తప్పుడు కేసులు నమోదు చేయిస్తోందని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి బీ ఎస్ యడియూరప్ప కార్యాలయ ముట్టడికి యత్నించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండురావు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తోందని నిరసిస్తూ గాంధీ విగ్రహం నుంచి రేస్‌కోర్స్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కార్యాలయం ముట్టడికి యత్నించారు గుండు రావు, బెంగళూరు రూరల్ ఎంపీ డీ కే సురేశ్. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపై నుంచి దూకడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
'భాజపా పద్ధతేమీ బాలేదు'
భాజపా ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు సిద్ధరామయ్య . సీసీఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించినందుకు మైసూరు విద్యార్థి యూటీ ఖాదర్‌పై కేసులు నమోదు చేశారు.. కానీ, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న భాజపా నేతలు సోమశేఖర రెడ్డి, అనంతకుమార్ హెగ్డేలపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదంటూ ఆయన మండిపడ్డారు.