కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 13న రాష్ట్రంలో కేబినెట్‌ను విస్తరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దిల్లీలో కలిసి బెంగళూరుకు వచ్చిన అనంతరం ప్రకటించారు.
"రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జనవరి 13వ తేదీ సాయంత్రం ఉంటుంది. ఇందుకోసం ఏడుగురి పేర్లను ఖరారు చేశాం. వారి పేర్లు, శాఖలను త్వరలోనే వెల్లడిస్తాం."
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
ఆదివారం రోజున దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు యడియూపరప్ప. మంత్రివర్గ విస్తరణపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం.. త్వరలోనే మీరు శుభవార్త వింటారని విలేకరుల సమావేశంలో చెప్పారు. భాజపా కర్ణాటక అధ్యక్షులు అరుణ్ సింగ్ కూడా సమవేశంలో పాల్గొన్నారు.
యడియూరప్పను తొలగిస్తారా?
అయితే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారంటూ చాలా కాలంగా భాజపాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా కేబినెట్ విస్తరణ జనవరి 20కి ముందే ఉంటుందని విశ్వసనీయ వర్గాలు ఇదివరకే తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్ఠానంతో చర్చించడం ఇదే చివరి సారి అని యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో మొత్తం ఉండాల్సిన మంత్రుల సంఖ్య 34 కాగా ప్రస్తుతం 27మంత్రులు ఉన్నారు.
ఇదీ చూడండి:'ఆధార్'లా రైతులకు 'స్వాభిమాని ఫార్మర్' కార్డ్