పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత వారం మంగళూరులో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విచారణకు ఉడిపి జిల్లా డిప్యూటీ కమిషనర్ జీ.జగదీశ్‌ను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడు నెలల్లో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని తెలిపింది.
ఇద్దరు మృతి
గతవారం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సుమారు 1500 మంది నిరసనకారులు మంగళూరు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడం, టైర్లకు నిప్పు పెట్టి పోలీస్ స్టేషన్లో విసిరే ప్రయత్నం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
మొదట పోలీసులు హెచ్చరించినప్పటికీ.. నిరసనకారులు వినకపోవడం వల్ల బాష్పాయువు ప్రయోగించారు. అప్పటికీ ఫలితం లేక రెండు రౌండ్లుకాల్పులు జరపగా.. నిరసనకారుల్లో ఇద్దరు మరణించారు.
మంగళూరులో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి నిరసనకారులు హింసాత్మక చర్యలు చేపడుతున్నందువల్ల 144 సెక్షన్‌ను విధించారు.