తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: మళ్లీ మొదటికి వచ్చిన సంక్షోభం - జేడీఎస్

కర్ణాటక రాజకీయాలు మళ్లీ మొదటికి చేరుకున్నాయి. ముగ్గురు అసమ్మతి ఎమ్మెల్యేలపై కర్ణాటక సభాపతి అనర్హత వేటుతో మిగిలిన 14 మంది సభ్యుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో భాజపా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటకీయం

By

Published : Jul 26, 2019, 5:27 AM IST

Updated : Jul 26, 2019, 6:56 AM IST

మళ్లీ మొదటికి వచ్చిన సంక్షోభం

కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో స్పీకర్​ రమేశ్​ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి సంచలనం సృష్టించారు.

స్వచ్ఛంద రాజీనామాలు కావు: స్పీకర్​

ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు స్వచ్ఛందంగా ఇచ్చినవి కావని తిరస్కరించారు సభాపతి. ఫిరాయింపు నిరోధక చట్టం కింద కర్ణాటక శాసనసభ కాలం ముగిసే 2023 వరకూ అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేలు రమేష్ జార్కిహోళి, మహేష్ కుమటల్లి, ఆర్​.శంకర్‌లపై స్పీకర్ వేటు వేశారు.

" ఈ అంశాలు కోర్టుకు వెళతాయి. కానీ స్పీకర్ ఆఫీసు క్వాసీ జుడీషియల్ విభాగం మిగిలిన 14 మంది విషయంలో వేచి చూడాల్సిందే. రాజకీయ అనిశ్చితి ఇకపై కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. ఈ నెల 31లోపు ద్రవ్య బిల్లు ఆమోదం పొందకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. ద్రవ్య బిల్లుకు ఆమోదం పొందకుంటే జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది."

-రమేశ్ కుమార్, కర్ణాటక స్పీకర్​

తొందరెందుకు?- భాజపా

కుమారస్వామి ప్రభుత్వం పడిపోయి 3 రోజులైనా నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప వయసు (77) కూడా ప్రతిబంధకంగా మారనుంది. 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని భాజపా నిబంధన పెట్టుకుంది.

భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో రాష్ట్ర నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించగా ఎందుకు తొందరని ప్రశ్నించినట్లు సమాచారం. అనర్హత వేటుతో విధానసభలో సభ్యుల బలం 221కి పడిపోయింది. మ్యాజిక్ సంఖ్య 110. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటే వారు మళ్లీ ఎన్నికలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో సభాపతి నిర్ణయం వరకూ ఆగాలని భాజపా అధిష్ఠానం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.

ద్రవ్య బిల్లు పరిస్థితేమిటి?

ఈ నెల 31 లోపు ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ద్రవ్య బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే కర్ణాటక అసెంబ్లీని రద్దు చేయటం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది.

జులై 30లోపు ప్రభుత్వం ఏర్పడకుంటే మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముందని సీఎల్పీ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ముగ్గురు ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్​ వేటు

Last Updated : Jul 26, 2019, 6:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details