తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 8:45 AM IST

ETV Bharat / bharat

కార్గిల్ విజయం: సైనిక సమరం.. దౌత్య వ్యూహం

కార్గిల్‌ యుద్ధం ఒక్కరాత్రిలో ముగిసింది కాదు. వారం కాదు.. నెలా కాదు.. ఏకంగా రెండు నెలల పాటు సాగింది ఈ సుదీర్ఘ పోరాటం. భారత జవాన్లు శత్రుమూకలను నియంత్రణ రేఖ నుంచి అవతలకు తరిమే వరకూ అలుపన్నదే లేకుండా పోరాడారు. హిమాలయాల్లోని మంచు కొండల్లో రక్తం చిందించిన ఈ యుద్ధంలో.. భారత్ జయభేరి మోగించింది. అయితే రణక్షేత్రంలోనే కాదు.. వ్యూహాత్మకంగా, దౌత్యపరంగానూ పాక్‌ను మట్టికరిపించింది. అంతర్జాతీయ సమాజం ముందు దాయాది ఆగడాలను బట్టబయలు చేసింది. దురాక్రమణలు ఎండగట్టి.. దోషిగా నిలబెట్టింది భారత్‌. సైనిక శక్తి పరంగానే కాక దౌత్యపరంగానూ భారత్‌ ఎంత బలమైనదో పాక్‌కు ప్రత్యక్షంగా రుచి చూపించింది కార్గిల్‌ యుద్ధం.

kargil war diplomatic and military trap to pakistan to win in kargil war 1999
కార్గిల్ విజయం

కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయం అనేక కోణాల్లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాటి యుద్ధం భారతసైన్యం సత్తాను ప్రపంచానికి చాటడమేకాదు.. దౌత్య వ్యూహాల పదునును కూడా తెలియజేసింది. యుద్ధం మొదలైన క్షణం నుంచి ఇటు దేశీయంగా... అటు అంతర్జాతీయంగా మద్దతు కూడా గట్టడంలో దిల్లీ నాయకత్వం సఫలీకృతమైంది. అంత యుద్ధం జరిగినా.. చివరకు భారీ విజయం లభించినా.. భారత సేనలు సరిహదుల్లో ఎక్కడా నియంత్రణరేఖ దాటకపోవటం గమనార్హం. ఆ విషయంలో దిల్లీ నిర్ణయం అంతర్జాతీయంగా అనేక దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు సానుకూలంగా మార్చింది.

సంయమనంతో సమరం

ఈ దౌత్యయుద్ధంలో రెండు అంశాల్లో భారత్‌ సర్వశక్తులూ ఒడ్డింది. పాక్‌ దురాక్రమణలో భారత్‌ బాధితదేశంగా మిగిలింది. దాయాది దేశం సిమ్లా ఒప్పందాన్ని తుంగలోకి తొక్కిందని భారత్‌ ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలియజేసింది. చొరబాట్లకు పాల్పడింది ఉగ్రవాదులు కాదు. ఆ ముసుగులో వచ్చింది.. పాకిస్థాన్‌ సైన్యమే అని ఆధారాలు చూపించింది. అన్నింటికి మించి.. అణుపరీక్షలతో ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలోనూ... అంతపెద్ద యుద్ధంలో ఎక్కడా అణు కవ్వింపులు లేకుండా.. మన సంయమనం స్థాయిల నిరూపించుకుంది. " ఇండియాస్‌ మిలటరీ కాన్‌ఫ్లిక్ట్స్‌ అండ్ డిప్లమసీ" అనే పుస్తకంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పేర్కొన్నారు నాటి సైన్యాధిపతి జనరల్‌ వీపీ మాలిక్.

వ్యూహాత్మక ప్రణాళిక

భారత్ శక్తితో పాటు యుక్తితో కొట్టిన వరస దెబ్బలతో అంతర్జాతీయంగా పాక్‌ ఏకాకి అయింది. పాక్‌ను అష్టదిగ్బంధం చేసిన భారత వ్యూహాలు చివరకు ఓటమిని అంగీకరించేలా చేశాయి. నాటి ప్రధాని వాజ్‌పేయి ఆధ్వర్యంలో వ్యూహాత్మంగా వేగంగా అడుగులేసి... ఈ యుద్ధంలో పాక్‌ దుందుడుకు చర్యలను ప్రపంచానికి చూపింది భారత దౌత్య బృందం. ఆధారాలతో సహా పాక్‌దే తప్పని నిరూపించగలిగింది. కార్గిల్‌లో పాక్‌ చొరబాట్ల గురించి తెలియగానే సైన్యంతో పాటు దౌత్య బృందాలను సమన్వయం చేసి.. పాక్‌ ఆగడాలను బయటపెట్టగలిగింది దిల్లీ నాయకత్వం.

ఆధారాలతో ఎండగట్టిన భారత్

తమకేం సంబంధం లేదన్న పాక్‌ బుకాయింపులపై.. కుట్రకు సంబంధించి.. పాక్‌ సేనల ఆడియో టేపులు బయటపెట్టి... నోట మాట లేకుండా చేశారు భారత అధికారులు. పాకిస్థాన్‌ అడ్డగోలు సమర్థనల కోసం కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినా పసలేని వారి వాదన వినే నాథుడే లేకుండాపోయాడు. నియంత్రణ రేఖ వెంట ఇలాంటి చర్యలు సర్వసాధారణమేనని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పేందుకు పాక్‌ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే.. అప్పటికే నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో వేగంగా పనిచేసిన బృందాలు పాక్‌ కుటిలత్వాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టాయి. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న పాక్‌ చర్యలు.. అందరిలో అసహనాన్ని పెంచాయి.

పాక్​కు షాక్..

ఇదే సమయంలో అణుసామర్థ్యం ఉన్న దేశం.. ఇంత బాధ్యతారాహిత్యంగా మరో అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశంపై దాడి చేయటం పరిస్థితులు విషమించేలా చేస్తుందని, పర్యవసనాలకు పాకిస్థానే బాధ్యతవహించాల్సిఉంటుందని ఘాటుగా హెచ్చరించింది భారత్‌. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు అండగా ఉంటాయని పాక్‌ భావించినా అందరూ ముఖం చాటేశారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా సమాఖ్య, G-8 దేశాలు కార్గిల్‌లో దుకాణం సద్దుకోకపోతే వచ్చే నిధులపై ఆంక్షలు తప్పవని హెచ్చరించటం పాక్‌కు షాక్‌ ఇచ్చింది. పాక్‌ ప్రధాని అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నించినా ఆ పప్పులేం ఉడకలేదు.

తోక ముడిచి దారిలోకి..

దిల్లీ చూపించిన సాక్ష్యాధారాలతో పాక్‌ సంప్రదాయ మద్దతుదారు ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్).. కూడా భారత్‌కు వ్యతిరేకంగా నిలిచేందుకు ఇష్టపడలేదు. ఈ పరిణామాలతో భారత్‌ రణక్షేత్రంలోనే కాక వ్యూహాత్మక విధానాల్లోనూ పాక్‌పై పైచేయి సాధించింది. పాక్‌ ప్రధానిపై తీవ్ర ఒత్తిడి పడింది. అంతర్జాతీయ ఒత్తిడి.. పాక్‌ సైన్యంలో అలుముకున్న నిస్సత్తువ.. వెరసి తోకముడిచింది. చివరకు... తొలుత యుద్ధంతో సంబంధం లేదని బుకాయించిన పాక్‌ చివరకు అంగీకరించక తప్పలేదు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశం దోషిగా నిలబడింది. ఉగ్రదేశంగా ముద్ర వేయించుకుంది. దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతింది. పాక్‌కు చిరకాలం గుర్తుండే గుణపాఠాన్ని ఈ యుద్ధంతో భారత్ నేర్పింది.

ABOUT THE AUTHOR

...view details