తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు' - మోదీ

'కార్గిల్ విజయ్​ దివస్'​ ప్రత్యేక కార్యక్రమాన్ని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్గిల్ విజయం భారత భూమి సుపుత్రుల ధైర్యసాహసానికి ప్రతీక అని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోదీ. సైనికులకు బతుకు, చావులంటే లెక్క లేదని వారు దేశం కోసం మాత్రమే పోరాడుతూ ముందుకు సాగుతుంటారన్నారు.

'యుద్ధం ప్రభుత్వాలు చేయవు...దేశం మొత్తం చేస్తుంది'

By

Published : Jul 27, 2019, 10:00 PM IST

Updated : Jul 27, 2019, 10:34 PM IST

యుద్ధం ప్రభుత్వాలు చేయవని, దేశం మొత్తం చేస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కార్గిల్ యుద్ధ విజయం భారత సామర్థ్యానికి నిదర్శనమన్నారు. కార్గిల్ యుద్ధ సమరంలో వారు చూపిన ధైర్యసాహసాలు, అంకిత భావం మరచిపోలేమని ఉద్ఘాటించారు. 20 ఏళ్ల క్రితం 500 పైగా సైనికులు బలిదానమయ్యారని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఉగ్రవాదం పేరుతో పరోక్ష యుద్ధం జరుగుతోందన్నారు మోదీ. ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్గిల్ యుద్ధం ఇప్పటికీ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.సైన్యానికి అధునాతన ఆయుధాలు అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు.

కార్గిల్​కు ముందు వాజ్​పేయీ ప్రభుత్వం పాకిస్థాన్​కు స్నేహ హస్తం చాచిందని గుర్తు చేశారు మోదీ. కానీ భారత్​ ఎప్పుడూ దురాక్రమణకు పాల్పడలేదన్నారు. ఐరాస శాంతి దళంలో మరణించిన వారిలో ఎక్కువ మంది భారత సైనికులేనన్నారు. ఇజ్రాయెల్​కు వెళ్తే భారత జవాన్లు హైఫాను విడిపించిన ఫొటోలు చూపిస్తారని, ఫ్రాన్స్​లో రెండో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తారని చెప్పారు.

కార్గిల్​ విజయ్​ దివస్​ 20 ఏళ్ల సందర్భంగా మోదీ ప్రసంగం.

"కార్గిల్ యుద్ధ వీరులకు, వారిని కన్న వీరమాతలకు వందనాలు. కఠోర పరిశ్రమ, త్యాగం, బాధ్యతల పట్ల సంకల్పబద్ధులై సైనికులు వీరోచిత కార్యాలు చేశారు. కార్గిల్ విజయం భారత సంకల్పం, సామర్థ్యం, మర్యాద, ప్రతి వ్యక్తి కర్తవ్య విజయం. యుద్ధం ప్రభుత్వాలు చేయవు... దేశం మొత్తం చేస్తుంది. ప్రభుత్వాలు వస్తాయి...పోతాయి. దేశం కోసం బతుకైనా, చావైనా లెక్క చేయని సైనికులు అమరులై నిలుస్తారు. సైనికులు రాబోయే భవిష్యత్​ కోసం బలిదానమౌతారు. సైనికులకు బతుకు, చావులంటే లెక్కలేదు...వారు కేవలం దేశం కోసం మాత్రమే పోరాడతారు.

20 ఏళ్ల క్రితం యుద్ధం కొనసాగుతున్నప్పుడు కార్గిల్ వెళ్లాను. ఉన్నత శిఖరాలపై నుంచి శత్రువులు పోరాడుతున్నారు. చావు ఎదురుగా ఉంది. మన జవాన్లు త్రివర్ణ పతాకాన్ని చేతబుచ్చుకుని కార్గిల్ శిఖరాన్ని అధిరోహించాలని ఉత్సాహం చూపుతున్నారు. కార్గిల్ విజయం వరించిన స్థలం నాకు తీర్థ యాత్ర వంటి అనుభూతినిస్తుంది. దేశం మొత్తం సైనికులకు అండగా నిలబడింది. యువకులు సైనికులకు రక్తమిచ్చేందుకు వరుసల్లో నిలబడ్డారు. వాజ్​పేయీ దేశ ప్రజలకు ఓ నమ్మకాన్ని ఇచ్చారు.

పాకిస్థాన్ ప్రారంభం నుంచే కశ్మీర్​ అంశంపై పోరాడుతుంది. 1948, 1965, 1971 లలో ఇదే పని చేసింది. కానీ 1999లో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఆ సమయంలో వాజ్​పేయీ అన్నారు. 'మన దాయాదులకు అనిపిస్తుందేమో భారత్​ ఖండించి ఊరుకొంటుందేమో, భయపడి వెనక్కి తగ్గుతుందేమో..తద్వారా నూతన సరిహద్దును గీయవచ్చు అనుకుంటుందేమో..కానీ మనం ఎదుర్కొనే విధానం ఊహించకూడదు' అని తలచారు.. ఈ యుద్ధనీతే పాక్​పై భారత్​కు విజయాన్ని ఇచ్చింది."

-నరేంద్రమోదీ, ప్రధాని

దిల్​ మాంగే మోర్

మృత వీరుల హృదయం ఒక జాతి కోసం, ఒక ప్రాంతం కోసం తపించలేదని దేశం మొత్తం కోసం పోరాడారన్నారు మోదీ. వారి స్ఫూర్తితో దేశానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మృత వీరులు జాతి విస్తృతాభివృద్ధిని కాంక్షించారని 'దిల్ మాంగే మోర్' అంటూ గుర్తు చేశారు.
పరమ వీర చక్ర పురస్కార గ్రహీతలు, మరణానంతరం అవార్డులు అందుకున్న వారి కుటుంబసభ్యులతో ఫొటోలు దిగారు మోదీ.

వేదికపై కార్గిల్ సాక్షులు మాత్రమే

కార్గిల్ విజయానికి 20 ఏళ్లయిన సందర్భంగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో వేదికపై కేవలం యుద్ధంలో పాల్గొన్న జవాన్లు, మృత వీరుల కుటుంబసభ్యులు మాత్రమే కూర్చున్నారు. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సహా అందరూ వేదిక కిందే ఆసీనులయ్యారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

'కుచ్​ కర్​ గుజర్​ నే కో కూన్​ చలా' (దేశం కోసం ఏదైనా చేసేందుకు రక్తం ఉరకలు వేస్తోంది) అని గాయకుడు మోహిత్ ఆలపించిన గీతం ఆహూతుల మనసుల్లో దేశభక్తిని ప్రోది చేసింది.

షిల్లాంగ్ గాయక బృందం 'ముజే గర్వ్​ హే హిందూస్థాన్ పర్' (దేశం పట్ల గర్వంగా ఉంది!) అనే గీతాన్ని ఆలపిస్తుండగా ఆర్మీ పబ్లిక్ పాఠశాల, దోల కువా విద్యార్థులు చేసిన నృత్య అభినయాన్ని ప్రధాని మోదీ సహా ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చూడండి:'వారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా'

Last Updated : Jul 27, 2019, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details