మహిళల భద్రతకు వినూత్న 'కీ' ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లోని వికాస్ నగర్‌కు చెందిన పూజా పాటిల్ అనే విద్యార్థిని వినూత్న ఆవిష్కరణ చేసింది. మహిళల భద్రతే లక్ష్యంగా ఓ'కీ చెయిన్' తయారు చేసింది. 'థింకర్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా పూజ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
ఎలా పని చేస్తుంది?
పూజా తయారు చేసిన ఈ 'కీ చెయిన్' వోల్టేజ్ ఆంప్లిఫికేషన్ పద్ధతిలో పనిచేస్తుంది. ఈ పరికరంలో ఓ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ద్వారా కరెంట్ అందుతుంది. ఎవరైనా అగంతుకులు మీద చేయి వేస్తే వెంటనే బటన్ నొక్కాలి. కీ చెయిన్ నుంచి వచ్చే 440 వాట్ల కరెంట్‌తో అవతలి వ్యక్తి స్పృహ కోల్పోతాడు.
వ్యర్థాలతోనే వినూత్నంగా..
పూజ తన ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలతోనే ఈ కీ చెయిన్‌ని తయారు చేసింది. ఈ పరికరం తయారీకి ఆమె చేసిన ఖర్చు కేవలం 300 రూపాయలే. పూజ సోదరుని సహకారం కూడా ఇందులో ఉంది. 12వ తరగతి చదువుతున్న శివ.. తనకు తెలిసిన సాంకేతికతతో పరికరానికి తుది మెరుగులు దిద్దాడు.
అందరి'కీ' అందే విధంగా..
తాను తయారు చేసిన పరికరం దేశంలోని ప్రతి మహిళకూ అందాలని ఆకాంక్షిస్తోంది పూజ. 'థింకర్ ఇండియా' కార్యక్రమ వ్యవస్థాపకుడు కౌస్తుబ్ ఒమర్ ఈ పరికరంపై స్పందించారు. ఈ పరికరాన్ని పూజ పేరుమీద పేటెంట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కీ చెయిన్ మార్కెట్లోకి విడుదలయ్యే విధంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు.