ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. భావితరాలకు అందిస్తూ.. హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రకృతి సిద్ధమైన చిత్రకళ 'కాంగ్ఢా'. ఈ చిత్రకళను భావి తరాలకు అందించాలని ఓ పాఠశాల నిర్విరామ కృషి చేస్తోంది.
'కాంగ్ఢా' చిత్రకళ హిమచల్‌ప్రదేశ్ ప్రాచీన కళారూపం. దీనిని పహారా, గులేర్ అని కూడా పిలుస్తారు. ఆ రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక, భాష, వారసత్వాన్ని ఈ కాంగ్ఢా చిత్రాలు ఉట్టిపడేలా చేస్తాయి.
ఎందుకింత ప్రత్యేకత?
కాంగ్ఢా చిత్రకళ అత్యంత ప్రాచుర్యం పొందటానికి కారణం వాటి సహజత్వం. ప్రకృతిలో లభ్యమయ్యే సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసిన రంగులను మాత్రమే ఇందులో వాడటం విశేషం. ఆకులు, రాళ్లు, బురద, విత్తనాలు, పువ్వులు, మూలికలు వంటి పదార్థాలతో రంగులను తయారుచేసి వినియోగిస్తారు. చిత్రాన్ని గీయడానికి ఉడత వెంట్రుకలతో తయారుచేసిన బ్రష్‌ను ఉపయోగించటం మరో ప్రత్యేకత. అందుకే ఈ కాంగ్ఢా చిత్రపటాలు వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
ప్రక్రియ
ఈ చిత్రాల్ని గీయటానికి ముందుగా ఓ కాగితంపై తెల్లటి పదార్థంతో పూత పూస్తారు. అనంతరం ఆ పేపర్‌ను మెరిసేలా చేయటానికి శంఖంతో రాపిడి చేస్తారు. ఇలా చేయటం వల్ల కాగితం బలంగా, ఎక్కువ కాలం ఉంటుంది.
ఎలా ప్రాచుర్యం?
17-19 శతాబ్దాల మధ్య రాజ్‌పుత్ర చక్రవర్తులు ఈ కళ అభివృద్ధికి కృషి చేశారని సమాచారం. గులేర్, బసోహ్లీ, చంబా, నూర్పుర్, బిలాస్‌పుర్ వంటి ప్రాంతాల్లో కాంగ్ఢా కళ విలసిల్లిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే 18 శతాబ్దంలో కాంగ్ఢా జిల్లాలోని గులేర్ ప్రాంతంలో ఈ కళ మరింత వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి వలసవచ్చిన మొగల్ చిత్రకారుడు ఇక్కడ స్థిరపడ్డాడు. అతని నుంచే ఈ సహజసిద్ధమైన చిత్రకళ ప్రపంచానికి తెలిసిందట.
కాంగ్ఢా చిత్రకారులు తొలుత రాజుల చిత్రపటాలు, ప్రేమకు నిదర్శనంగా ఉండే రాధాకృష్ణ చిత్రపటాలను చిత్రించేవారు. భారతీయ చిత్రకారుడు మోలా రామ్ ఈ కాంగ్ఢా కళ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రస్తుతం 'కాంగ్ఢా స్కూల్ ఆఫ్ పెయింటింగ్' ఈ కళ అభివృద్ధికి పాటుపడుతోంది.
"నేను ఈ వృత్తిలోకి వచ్చి 32 ఏళ్లైంది. ఒక్కో చిత్రాన్ని గీయటానికి, నేర్చుకోవటానికి చాలా సమయం పడుతుంది. పెద్ద చిత్రాలు గీయడానికి నెలల సమయం పడుతుంది. మా తరంలో గురుకులం విధానంలో కాంగ్ఢా కళ నేర్పించటానికి పాఠశాలలు ఉండేవి. అదే విధంగా ప్రభుత్వం కాంగ్ఢా, ధర్మశాల ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తే ఈ చిత్రకళను మరింత మంది నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది."
-ముఖేష్ దీమన్, చిత్రకారుడు
ఇదీ చూడండి : 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'