లోక్ సభ ఎన్నికలకు కమల్ దూరం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. కోయంబత్తూర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. లోక్ సభతో పాటు 18 స్థానాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థుల తుది జాబితాను కమల్ ప్రకటించారు. అందులో ఆయన పేరు మాత్రం లేదు. దీనిపై వివరణ ఇచ్చారీ సినీ నటుడు.
''నేను పోటీ చేయనందుకు ఎవరూ చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే పార్టీ తరపున బరిలో దిగేవారంతా నా ప్రతి రూపాలే. అందరూ లక్ష్యసాధన కోసమే పని చేస్తారు''
- కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు
తమ పార్టీ తరపున గెలిచిన వారెవరైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే వెంటనే వారితో రాజీనామా చేయిస్తామని వెల్లడించారు కమల్.
ఈ సభలో ఎంఎన్ఎం పార్టీ మ్యానిఫెస్టోలో ఆయన ప్రకటించారు. తమిళనాడులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, పేదరిక నిర్మూలన చేస్తామని ప్రకటించారు. మురికి వాడలు లేని రాష్ట్రంగా తమిళనాడుని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు ఇప్పిస్తామని మ్యానిఫెస్టోలో తెలిపారు.