'పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఓ ఆశ్చర్యం' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు, విశ్వనటుడు కమల్‌హాసన్ సమర్థించారు. రజనీకాంత్ వ్యాఖ్యలు 'విమర్శ కాదు వాస్తవికత' అని కమల్ అభిప్రాయపడ్డారు.
ప్రజల కోసం కలిసి పనిచేస్తాం!
తమిళనాడు సంక్షేమం కోసం రజనీకాంత్‌తో చేతులు కలపడానికి తాను సిద్ధమేనని, అయితే రాజకీయంగా అది వీలవుతుందో లేదో చెప్పలేమని కమల్ అన్నారు. తాము సినీ పరిశ్రమలో మాత్రం 44 ఏళ్లుగా కలిసే ఉన్నామని కమల్ పేర్కొన్నారు.
కమల్ వ్యాఖ్యలపై కాసేపటికే స్పందించిన రజనీ... ప్రజల కోసం అవసరమైతే తామిద్దరం కచ్చితంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
మంచి నేత కావాలంటే..
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొటాబయ రాజపక్స... మంచి నేతగా పేరుపొందాలంటే.. సమాజంలోని అన్ని వర్గాలకూ సమాన న్యాయం చేకూర్చాలని కమల్‌హాసన్ అభిప్రాయపడ్డారు.
అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి
కమల్‌హాసన్ సినిమా పరిశ్రమకు వచ్చి 60 ఏళ్లు గడిచిన సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
" ముఖ్యమంత్రి అవుతానని పళనిస్వామి కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఆయన ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో ఏమైనా సాధ్యమే."- రజనీకాంత్, ప్రముఖ నటుడు
మండిపడ్డ ఏఐఏడీఎంకే
రజనీకాంత్ వ్యాఖ్యలపై అధికార ఏఐఏడీఎంకే తీవ్రంగా స్పందించింది. పళనిస్వామి అనుకోకుండా ముఖ్యమంత్రి కాలేదని, స్వయంకృషితో ఉన్నతస్థానాన్ని అధిరోహించారని పేర్కొంది.
మహానటులు కలుస్తారా?
కమల్‌హాసన్ ఇప్పటికే ఎమ్ఎన్ఎమ్ పార్టీ స్థాపించి రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించారు. 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఇద్దరు నటులు కలిసి ముందుకు వెళ్తారా? లేదా? చూడాలి.
ఇదీ చూడండి:'గాంధీ'ల భద్రత కోసం కొత్తగా వెయ్యి మంది జవాన్లు!