ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ నేతలు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కొందరు ప్రమాదాలు జరిగినట్లు సృష్టించిన విషయాలు సినిమాల్లో చూసి ఉంటాం. కానీ.. బంగాల్ ఉప ఎన్నికల్లో పోలీసుల సాక్షిగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్‌ప్రకాశ్ మజుందార్‌పై దాడి జరిగినా.. ప్రజల్లో ఆయనపై సానుభూతి కలగలేదు. ఓట్లూ పడలేదు. అందుకు.. ఆయనపై దాడి జరిగిన పోలింగ్ బూత్‌లో రెండంటే రెండే ఓట్ల రావటమే నిదర్శనం.
ఈ నెల 25న పోలింగ్ జరుగుతున్న సమయంలో కలియాగంజ్ నియోజకవర్గం ఘియాఘాట్ గ్రామంలోని 32, 33 నెంబరు పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వచ్చారు భాజపా అభ్యర్థి జయ్ ప్రకాశ్ మజుందార్. ఆ సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఓ వ్యక్తి కాలితో తన్నగా మజుందార్ ముళ్లపొదల్లో పడిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్నికల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది.