ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్పై అంతర్జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు గోరఖ్పుర్కు చెందిన పిల్లల వైద్యుడు కఫీల్ ఖాన్. తనపై అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొంటూ.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం(యూఎన్హెచ్ఆర్సీ)కు లేఖ రాశారు. భారత్లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘించటం, ఎన్ఎస్ఏ, యూఏపీఏ వంటి చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రజాగొంతుకను అణచివేస్తున్నారని ఆరోపించారు.
పౌరచట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తూ అరెస్టు అయిన కార్యకర్తల హక్కులను కాపాడాలని భారత ప్రభుత్వానికి సూచించటం పట్ల యూఎన్హెచ్ఆర్సీకి కృతజ్ఞతలు తెలిపారు కఫీల్. అయితే.. ప్రభుత్వమే తమ వినతిని పట్టించుకోవటం లేదన్నారు.
"భారత్లోని అత్యంత పేద, అట్టడుగు ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తే వారిని అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక, జాతీయ భద్రతా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నారు. జైలులో ఉన్న సమయంలో శారీరకంగా, మానసికంగా క్షోభకు గురయ్యా. చాలా రోజుల వరకు ఆహారం, మంచి నీళ్లు తీసుకోలేదు. చాలా రద్దీగా, ఇరుకుగా ఉండే మథుర జైలులో అత్యంత దయనీయంగా, అమానవీయంగా ఏడు నెలల పాటు శిక్ష అనుభవించా. అదృష్టవశాత్తు.. నాపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. నాపై చేపట్టిన చర్యలను చట్టవిరుద్ధమని తేల్చింది."