చంద్రయాన్-2 ఆర్బిటార్ సమర్థంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. విక్రమ్ ల్యాండర్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు అందలేదన్నారు. ల్యాండర్‌లో తలెత్తిన సమస్యలను విశ్లేషించేందుకు జాతీయస్థాయి కమిటీని నియమించినట్లు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇస్రో చర్యలు చేపడుతుందని చెప్పారు.
"ఆర్బిటార్ చాలా బాగా పనిచేస్తోంది. విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు ఇంకా అందలేదు. కానీ ఆర్బిటార్ అద్భుతంగా పనిచేస్తోంది. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టబోతున్నాం. సూర్యుడిపై పరిశోధనలు చేపట్టే తొలి మిషన్ ఇది. గగన్‌యాన్ యాత్ర కోసం ఇస్రో ప్రస్తుతం సమాయత్తమవుతోంది. 2021 డిసెంబర్ కల్లా మానవసహిత అంతరిక్ష యాత్రను చేపడతాం."