భారతదేశ 46వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి పదవీవిరమణ చేశారు. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి ఈశాన్య భారతీయుడిగా రికార్డులకెక్కారు జస్టిస్ గొగొయి. ఎన్నో దశాబ్దాల పాటు వార్తల్లో నిలిచిన అత్యంత సున్నితమైన అయోధ్య భూవివాదానికి ముగింపు పలికిన ఘనత జస్టిస్ గొగొయి సొంతం.
జడ్జిగా, సీజేఐగా ఎన్నో వివాదాలు, వ్యక్తిగత ఆరోపణలు జస్టిస్ గొగొయిను చుట్టుముట్టినా... అవేవీ ఆయన విధి నిర్వహణకు అడ్డుపడలేదు. ఇందుకు గత కొన్ని వారాల్లో జస్టిస్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనాలు వెలువరించిన తీర్పులే ఉదాహరణలు.
ప్రశ్నలు.. సంచలన తీర్పులు..
సుప్రీంకోర్టు 1950లో ఏర్పాటైంది. అంతకు ముందే ఎన్నో దశాబ్దాల నుంచి అయోధ్య భూవివాదం సర్వత్రా చర్చనీయాంశమైంది. అటువంటి అత్యంత సున్నితమైన కేసులో.. వివాదాస్పద 2.77 ఎకారాల భూమిలో రామమందిరాన్ని నిర్మించాలంటూ తీర్పు వెలువరించి భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు 64ఏళ్ల జస్టిస్ గొగొయి.
2018 జనవరిలో అప్పటి సీజేఐ పనితీరును ప్రశ్నించి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జిల్లో ఒకరు జస్టిస్ రంజన్ గొగొయి.
రఫేల్ వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి రెండుసార్లు క్లీన్చిట్ ఇచ్చింది జస్టిస్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం. కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేసి రాహుల్ గాంధీకి ఊరటనిచ్చినప్పటికీ... భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఈ ధర్మాసనమే.
భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని మరో సంచలన తీర్పునిచ్చారు జస్టిస్ గొగొయి. వీటితో పాటు శబరిమల, మనీ బిల్లు 2017 వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనాలకు సిఫార్సు చేశారు. ఇవన్నీ చివరి 8 పనిదినాల్లో జరగడం విశేషం.
తన 65వ జన్మదినానికి ఒక్క రోజు ముందు సీజేఐ పదవికి వీడ్కోలు పలికారు జస్టిస్ గొగొయి. అయితే ఈ నెల 15నే సీజేఐగా ఆయన చివరి పనిదినం ముగిసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇదీ చూడండి:-భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే