ప్రజల అభిప్రాయాలను దేశద్రోహం చట్టం పేరుతో ప్రభుత్వం ఉక్కు పిడికిలితో అణిచివేస్తోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకుర్ అభిప్రాయపడ్డారు. సోమవారం "వాక్ స్వాతంత్ర్యం, న్యాయవ్యవస్థ"పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
'దుర్వినియోగమవుతున్న దేశద్రోహ చట్టం'
దేశద్రోహం చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.బీ లోకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను ఉక్కు పిడికిలితో అణిచివేస్తోందని అభిప్రాయపడ్డారు. విలేకరులపైనా ఈ కేసులు నమోదు చేశారని ఆక్షేపించారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంది యువకులను దేశద్రోహులుగా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. స్వల్ప విషయాలకూ దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వెంటిలేటర్ల కొరతను, భారీ రుసుముల వసూలును చాలా మంది విలేకరులు వెలుగులోకి తెచ్చారని.. వారి పైనా దేశద్రోహ చట్టాలను నమోదు చేశారని లోకుర్ ఆక్షేపించారు.
ప్రశాంత్ భూషణ్‌పై సుప్రీంకోర్టు తీర్పునూ ఆయన తప్పుపట్టారు. ఆయన ట్వీట్లను సర్వోన్నత న్యాయస్థానం తప్పుగా అర్థం చేసుకుందన్నారు. వైద్యుడు కఫీల్ ఖాన్ ప్రసంగాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని లోకుర్ గుర్తు చేశారు. వెబినార్‌లో సీనియర్ పాత్రికేయుడు ఎన్.రామ్ మాట్లాడుతూ.. భూషణ్ కేసు.. అసంబద్ధమైందని పేర్కొన్నారు. కోర్టు నిర్ధారించిన విషయాలకు వాస్తవ ప్రాతిపదిక లేదన్నారు. భూషణ్ కంటే ఘాటుగా రోజూ పత్రికలు , ప్రచార సాధనాలు వ్యాఖ్యానాలు చేస్తున్నాయని తెలిపారు.