రాజ్యాంగ స్ఫూర్తిని యథాతథంగా అమలుచేస్తూ... అది సర్వోన్నతమైనదని నిరూపించేందుకు నిరంతరం కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా... దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డగా మిగిలిపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా... దాన్ని అమలు చేసేవారు సజ్జనులైతే అది మంచిగా నిలిచిపోతుంది’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను సదా మదిలో ఉంచుకొని నడుచుకోవాలని సూచించారు. మంగళవారం సుప్రీంకోర్టులో ఏర్పాటుచేసిన 70వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు.
‘‘విభజనలు, దోపిడీలతో గడిచిన గతం- సమసమాజ స్థాపన కోసం అంకితమైన భవిష్యత్తు మధ్య వంతెన నిర్మించే ప్రయత్నాన్ని రాజ్యాంగం చేసింది. ప్రతి నవంబరు 26న సుప్రీం కోర్టు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల పట్ల గౌరవాభిమానాలను చాటుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో రాజ్యాంగం నిర్దేశించిన ఆదర్శాలను ఆచరణలో చూపేందుకు ప్రయత్నించిన వారిని మరవకూడదు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడంతోపాటు, అందరినీ కలుపుకొని పోతేనే ప్రజాస్వామ్య సంస్థలు విజయవంతంగా పనిచేస్తాయని డాక్టర్ రాజేంద్రప్రసాద్ 70 ఏళ్ల కిందట ఇదేరోజు చెప్పారు. రాజ్యాంగం హక్కులతో పాటు... బాధ్యతలను కూడా నిర్దేశించిందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. రాజ్యాంగం బలపడాలంటే రాజ్యాంగ వ్యవస్థల పనితీరు, నిర్వహణ మెరుగుపడుతూ ఉండాలి. బ్రిటిష్ కాలం నాటి ఆలోచన ధోరణిని విడనాడాలి. రాజ్యాంగం పట్ల మన నిబద్ధతను మరోసారి చాటుకోవడం, గతం గురించి ఆత్మపరిశీలన చేసుకోవడం ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగం ప్రకారం... అంతిమ న్యాయనిర్ణేత అయిన సుప్రీంకోర్టు పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఉన్న మార్గాలను మనం పరిశీలించాలి. నూతన సాధనాలను అందిపుచ్చుకొని; సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలను అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయవ్యవస్థకు రూపకల్పన చేయాలి."
-జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
జస్టిస్ బోబ్డే శ్రమను అభినందించాల్సిందే..
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే కఠోర శ్రమను అందరూ అభినందించాల్సిందే. న్యాయస్థానం తీర్పులను సాధ్యమైనన్ని ఎక్కువ భాషల్లోకి అనువదించేందుకు శ్రమించడమే కాకుండా... సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయవ్యవస్థ, న్యాయ ప్రక్రియను ప్రజలు అర్థం చేసుకొనేలా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం అనుపమానం. ఏడాదిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, కక్షిదారులకు న్యాయవ్యవస్థను అందుబాటులోకి తేవడానికి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విశేష కృషి చేస్తున్నారు.’’ అని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
ఆ తీర్పుల్లో సమైక్య స్ఫూర్తి: రవిశంకర్
రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం తదితర కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు... భారత నాగరికతలోని సమైక్య భావనను ఇముడ్చుకున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకుని మెలగాలన్నారు.