భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని, విరుద్ధ అభిప్రాయాలపై జాతి వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక ముద్రలు వేయడం తగదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ధోరణి.. రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని, వివేకశీల ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించాలని పెట్టుకున్న లక్ష్యాలను దెబ్బతీస్తుందన్నారు.
గుజరాత్లోని అహ్మాదాబాద్లో జస్టిస్ పి.డి దేశాయ్ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రచూడ్. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగించి భిన్నాభిప్రాయాన్ని అణచివేసే ప్రయత్నం భయాన్ని పెంపొందిస్తుందని.. సమన్యాయ పాలన సూత్రాన్ని అతిక్రమించడానికి, రాజ్యాంగం కాంక్షించిన భిన్నత్వ సమాజ స్థాపన దార్శనికత నుంచి తప్పుదారి పట్టడానికి అనువైన పరిస్థితులనూ కల్పిస్తుందన్నారు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ప్రశ్నించడానికి ఉన్న అవకాశాలను దెబ్బతీస్తే.. అది రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక పునాదులను ధ్వంసం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ సావధానపూర్వక చర్చలు జరిగేలా చూడటం అత్యవసరమని పేర్కొన్నారు.
"ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యాలు అల్పసంఖ్యాక గొంతులను అణచివేయవు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది సంప్రదింపులు, ఏకాభిప్రాయంతోనే తప్ప.. సంఖ్య ఆధారంగా కాదు."