తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోల్ ప్యానెళ్ల వల్ల ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. వీటి వల్ల అన్ని వర్గాలు ఒక్కచోటుకు చేరుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేపై కాంగ్రెస్-డీఎంకే కూటమి సునాయాస విజయాన్ని అందుకుంటుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలపై ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం ఇటీవల పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్యానెళ్లను జంబో కమిటీలుగా పేర్కొంటూ.. వాటి వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కమిటీలో ఎవరికీ అధికారం లేదని, కాబట్టి జవాబుదారీతనం కూడా ఉండదని చెప్పుకొచ్చారు.
తాజాగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) వార్తా సంస్థకు ముఖాముఖి ఇచ్చిన అయ్యర్.. కార్తీ వాదనను తోసిపుచ్చారు.
"జంబో విధానం అనేది పార్టీలోని అగ్రనాయకత్వంలో ఉన్న అభిప్రాయభేదాలను తొలగించడానికే. ఈ విధానం తిరగబడుతుందని నేను భావించడం లేదు. ఈ కమిటీలలోని సభ్యులు చిన్నచిన్న బృందాలుగా ఏర్పడి నిర్ణయాలు తీసుకోవాలి. దీని వల్ల పార్టీ నేతలు ఏకతాటిపైకి వస్తారు. పార్టీలో వర్గాలు ఉన్నాయి, వాటిని గుర్తించడమే ఉత్తమం. జంబో కమిటీల వల్ల ప్రతి వర్గం వారు తమకు ప్రాతినిధ్యం ఉందని గుర్తిస్తారు. ఇది కాంగ్రెస్కు ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అనుకోవట్లేదు."