ప్రస్తుత 'సెంట్రల్ విస్టా' (రాష్ట్రపతి భవన్- ఇండియా గేట్ మధ్య ప్రాంతం) ఆధునికీకరణకు బృహత్ ప్రణాళిక రూపొందించారు. రేపటి అవసరాలకు అనుగుణంగా నూతన పార్లమెంటు, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్లమెంటు, కేంద్ర శాఖల కార్యాలయాలు, నిరసన కార్యక్రమాల కేంద్రం జంతర్‌మంతర్, సుప్రీంకోర్టు.. ఇవన్నీ కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి దిల్లీ రైల్వేస్టేషన్ 4 కిలోమీటర్లు, విమానాశ్రయం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వంతో పనిపై దిల్లీ వచ్చిన వారు 5 కిలోమీటర్ల పరిధిలో పనులు చూసుకుని వెళ్లడానికి వీలవుతోంది.
గాంధీనగర్‌కు ఆదర్శం దేశ రాజధాని
దేశ రాజధానిని స్ఫూర్తిగా తీసుకొనే గాంధీనగర్‌లో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మించారు. అక్కడ అసెంబ్లీకి అటూఇటూ రెండువైపులా పది అంతస్తుల భవనాల్లో అన్ని మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఇలా..
దేశ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చాలని 1911లో బ్రిటిషర్లు నిర్ణయించారు. న్యూదిల్లీ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేసి పాలన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి ప్రభుత్వాధినేత వైస్రాయ్ నివాసం (నేటి రాష్ట్రపతి భవన్) కేంద్రంగా చేసుకొని సర్ ఎడ్విన్ ల్యుటియెన్స్.. పార్లమెంటు, పాలనా వ్యవస్థల ప్రాంగణాలకు రూపకల్పన చేశారు. అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని ల్యుటియెన్స్ బంగ్లా జోన్‌గా పిలుస్తారు.
ఇది దేశ పరిపాలనకు కేంద్ర స్థానం. పౌరవిమానయాన, ఐటీ, ఎలక్ట్రానిక్, అటవీ, పర్యావరణ శాఖల కార్యాలయాలు మినహాయించి కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వశాఖల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 51 శాఖల విభాగాలకుగాను 21 శాఖల విభాగాలు సెంట్రల్ విస్టా పరిధిలో ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా సెంట్రల్ విస్టాలోకి తెచ్చేందుకు ఆధునికీకరణ చేపట్టారు.
కార్యాలయాలు
రాష్ట్రపతి భవన్ గేటు బయట కుడి, ఎడమల్లో దేశ కార్యనిర్వాహక వ్యవస్థలకు ప్రాణాధారమైన ప్రధానమంత్రి, రక్షణ శాఖ కార్యాలయాలు (సెక్రటేరియట్ బిల్డింగ్‌లో భాగమైన సౌత్ బ్లాక్‌లో); ఆర్థిక, హోంశాఖ కార్యాలయాలు (నార్త్ బ్లాక్‌లో) ఉన్నాయి.
పార్లమెంటు భవనం
ఈ కార్యాలయాల తర్వాత పార్లమెంటు భవనం ఠీవిగా కనిపిస్తుంది. 1921లో నిర్మాణం ప్రారంభమై 1927 జనవరి 18న ప్రారంభమైన ఈ భవనం 93 ఏళ్లుగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మందిరంగా భాసిల్లుతోంది. రాష్ట్రపతి భవన్ నుంచి కాలినడకన రావచ్చు.
మంత్రిత్వ శాఖలు
* పార్లమెంటుకు పక్కనే ఉన్న రైలు భవన్‌లో రైల్వేమంత్రిత్వ శాఖ, ఆ పక్కనే కృషీ భవన్‌లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.
* వాణిజ్యం, ఉక్కు, జౌళి మంత్రిత్వశాఖలన్నీ ఉద్యోగ్ భవన్‌లో కొలువుదీరి ఉన్నాయి.
* వైద్య ఆరోగ్యం, పట్టణాభివృద్ధి శాఖలు నిర్మాణ్ భవన్‌లో దర్శనమిస్తాయి. పలు శాఖలు శాస్త్రి భవన్‌లో కొలువుదీరాయి.
* జాతీయ మీడియా కోసం నేషనల్ మీడియా సెంటర్ పేరుతో భారీ సముదాయాన్ని ఇక్కడే నిర్మించారు.
* ఇవికాక మిగిలిన అత్యధిక కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (సీజీఓ)లో ఉన్నాయి. అది పార్లమెంటుకు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సుప్రీంకోర్టు
దేశ న్యాయవ్యవస్థకు మణిమకుటం అయిన సుప్రీంకోర్టు ఇక్కడికి కేవలం 3.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1937 నుంచి 1950 వరకు పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే కోర్టుని నిర్వహించేవారు. పార్లమెంటుకు సమీపంలోని ప్రస్తుతం సుప్రీం కోర్టు భవనానికి 1954 అక్టోబరు 29న తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ శంకుస్థాపన చేశారు. 1958 నుంచి సర్వోన్నత న్యాయస్థానం సమున్నత ప్రస్థానాన్ని ఈ భవనంలో ప్రారంభించింది.
దిల్లీ హైకోర్టు.. దిగువ కోర్టు.. హరిత ట్రైబ్యునల్
సుప్రీంకోర్టుకు కిలోమీటరు దూరంలోనే హైకోర్టు, జిల్లా కోర్టు ఏర్పాటు చేశారు. దీంతో.. దిల్లీలోని న్యాయవాదులు ఒకే రోజు మూడు కోర్టుల్లోనూ సేవలందించగలుగుతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా సుప్రీంకోర్టుకు అతి సమీపంలో ఉంది. పార్లమెంటు, కోర్టులు సమీపంలో ఉండటంతో ఎంపీలుగా ఉన్న చాలామంది సీనియర్ అడ్వొకేట్లు ఉదయం కోర్టులకెళ్లి వాదనలు వినిపించి పార్లమెంటుకొచ్చి సమావేశాల్లో పాలుపంచుకుంటున్నారు. కార్యదర్శి స్థాయి అధికారులు పార్లమెంటులో తమ మంత్రిత్వశాఖలకు సంబంధించిన ప్రశ్నలు, చర్చలు ఉన్నప్పుడు ఆ సమయానికి వచ్చి వెంటనే తిరిగి వెళ్లగలుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో ఉంది. జాతీయస్థాయి అధికారిక సమావేశాలు జరిగే విజ్ఞాన్ భవన్; ఎగ్జిబిషన్‌లు, ఆటోఎక్స్‌పోలు జరిగే ప్రగతి మైదాన్ పాలనా యంత్రాంగానికి సమీపంలో ఏర్పాటయ్యాయి.
ల్యుటియెన్స్ బంగ్లా జోన్‌లో ఉన్న కార్యాలయాలు, నివాసాలు
(విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లు)