తెలంగాణ

telangana

ETV Bharat / bharat

న్యాయం ఉసురుతీస్తున్న నేరం.. మార్పు ఎప్పుడు? - unnav rape victim

న్యాయపోరాటంలో ఓ అబల ఎంతటి భయవిహ్వల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో రుజువుచేసిన ఘటన ఉన్నావ్​. నేర న్యాయ వ్యవస్థపై కుల రాజకీయ మల్లుల భల్లూకపు పట్టును సోదాహరణగా చాటుతోంది. ఆ వివరం చిత్తగించండి!

judicial system in india
న్యాయం ఉసురుతీస్తున్న నేరం

By

Published : Dec 22, 2019, 7:46 AM IST

దోపిడి పీడనలకు తావులేని, అఘాయిత్యాలకు హత్యాచారాలకు ఆస్కారం లేని భయరహిత సమాజం- ఎంత అందమైన స్వప్నం? శీలహీన రాజకీయాల ఉరవడిలో కొట్టుకొచ్చిన దుశ్శాసన సంతతి ప్రజాప్రాతినిధ్యం వహిస్తుంటే, నానావిధ నేరగాళ్ల అభయారణ్యంగా దిగజారిన మన భారతంలో ప్రతి పుటలోనూ కళ్లకు కడుతోంది- మానభంగ పర్వం! చెడు మీద మంచి సాధించిన ప్రతి విజయాన్నీ పండగలా జరుపుకోవడం భారతీయ సంస్కృతి. నేరన్యాయ వ్యవస్థకు చెదలు పట్టిన సమకాలీన దురవస్థ- పతితులు భ్రష్టులు బాధాసర్పదష్టులకు న్యాయాన్ని అక్షరాలా ఎండమావిగా మార్చేస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆత్మాహుతికి సిద్ధపడితే తప్ప తనకు జరిగిన అన్యాయంపై చట్టబద్ధ యంత్రాంగాల్లో కనీసం కదలికైనా రాని రాష్ట్రంలో ఓ అభాగిని ఆక్రందన, ఆ గొంతును కొరికేయడానికి అధికార మదమృగాల అమానుష వేట- ఆటవికతకు నిదర్శనంగా నిలిచాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొన్నాక, నెలన్నర రోజుల్లో కేసు ఫైసలా కావాలన్న ఫర్మానాలు జారీఅయ్యాక ఎట్టకేలకు ప్రధాన నిందితుడికి జీవనపర్యంత ఖైదు శిక్షగా పడింది. న్యాయపోరాటంలో ఓ అబల ఎంతటి భయవిహ్వల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో రుజువుచేసిన ఈ కేసు- నేర న్యాయ వ్యవస్థపై కుల రాజకీయ మల్లుల భల్లూకపు పట్టును సోదాహరణగా చాటుతోంది. ఆ వివరం చిత్తగించండి!

న్యాయార్థులకు అన్యాయం

నేరరహిత సమాజం రూపొందాలంటే నేరగాళ్లను ఏరెయ్యాల్సిందేనని ఉత్తర్‌ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు లోగడ తీర్మానించింది. ఈ సర్పయాగంలో వందమందికి పైగా నేరగాళ్లు, అసాంఘిక శక్తులకు నూకలు చెల్లాయి. 2017లో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కొలువైన మూడు నెలలకే రాష్ట్రంలో మంఖి అనే గ్రామం నుంచి 17 ఏళ్ల ఆడపిల్ల కనిపించకుండాపోయింది. అప్పటి భాజపా శాసనసభ్యుడు కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌, అతగాడి సోదరుడు అతుప్‌ సింగ్‌, వాళ్ల అనుచరులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కుటుంబ సభ్యులు ‘తమ బిడ్డ కనబడటం లేదు’ అని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్నాళ్లకు నేరగాళ్ల చెర నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చెయ్యడానికి మనస్కరించని పోలీసులు.. పెళ్ళి చేసుకోవాలని బలవంత పెడుతూ అపహరించినట్లుగా కేసు రాసి పెద్దమనసు చాటుకొన్నారు. అయిందేదో అయిందని నోర్మూసుకోకుండా కేసులు గట్రా పెట్టడం ఏమిటంటూ ఎమ్మెల్యే అనుచరులు ‘ఆమె’ తండ్రిని చితకబాదితే, అక్రమ ఆయుధాల కేసుపెట్టి పోలీసులు ఠాణాకు తరలించారు. ప్రాణం తీస్తామంటూ బెదిరింపులు పెరిగేసరికి ఆ పదిహేడేళ్ల పాప ముఖ్యమంత్రి ముంగిట ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ మర్నాడే ఆమె తండ్రి దేహం పోలీసు కస్టడీలో శవమై తేలింది! ఈ అమానుషాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలై అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించాకే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగి నేరానికి ఒడిగట్టిన సోదరులను, వాళ్ల గ్యాంగును నిర్బంధించింది. ఏలినవారి మనసెరిగి మసలుకొనే కేదస సైతం నిందితులపై అభియోగాలు మోపడానికి ఏడాదికి పైగా సమయం తీసుకొంది. ఈలోగా నేరసోదర ద్వయం భిన్నరూపాల్లో పంజా విసరింది. హత్యాయత్నం కేసుపెట్టి ఆ బాలిక మామకు పదేళ్ల జైలుశిక్ష పడేలా చేశారు. లారీతో గుద్దించి ఆ పిల్ల కుటుంబం మొత్తాన్ని కడతేర్చాలన్న పథకం విఫలం కాగా, తీవ్రగాయాలతో బాధితురాలు ఆమె లాయరు బయటపడి, ఆమె ఇద్దరు బంధువులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోరంపై లోకం కోడై కూస్తుంటే కమలనాథులు సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. తనకు ప్రాణహాని ఉందంటూ మొన్న జులై 17న బాధితురాలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఆ నెలాఖరుకు వెలుగులోకి రాగా, కేసును దిల్లీ కోర్టుకు బదలాయించిన సుప్రీంకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది. దోష నిరూపణ జరిగి ప్రధాన నిందితుడికి జీవనపర్యంత ఖైదు శిక్ష పడినా ఇంకెందరెందరో సెంగార్ల ఉక్కుపిడికిట్లో చిక్కి న్యాయార్థులకు అన్యాయం చేస్తున్న పోలీసు, దర్యాప్తు సంస్థల మాటేమిటి?

పరిహారం కోర్టులే చెల్లించాలి..

ఈ ఉన్నావ్‌ అత్యాచార కేసులో బాధితురాలికి పరిహారం చట్టబద్ధంగా కోర్టులే చెల్లించాలని సొలిసిటర్‌ జనరల్‌ అన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఎంతో కీలకమైనవి. ‘ఈ కేసులో చట్టబద్ధంగా ఏదైనా జరిగిందా? అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది?’ అని సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది. ఘనత వహించిన యూపీలోనే మొన్న సెప్టెంబరు నుంచి అయిదు హత్యాచార ఘటనలు నమోదయ్యాయి. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ కొందరిపై కేసుపెట్టిన ఓ మహిళ కోర్టు వాయిదాకు వస్తుంటే దుండగులు కాపు కాసి పెట్రోలు పోసి తగలబెట్టారు. నిలువునా ఆహుతి అవుతూ కిలోమీటరు దూరం పరిగెత్తిన మహిళ, ఆసుపత్రిలో కనుమూసే ముందు- తనకు ఆ గతి పట్టించినవాళ్లను ఉరితీయడం చూడాలని ఉందని అభిలషించింది. లోగడ పంజాబులో ఓ ఆడపిల్ల తనపై అఘాయిత్యం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా దుండగులపై ఈగైనా వాలకపోవడంతో అవమానభారంతో ఆత్మహత్య చేసుకొంది. రాజకీయాధికారం నేరాలకు లైసెన్సుగా దిగజారుతున్న వైనం- చట్టబద్ధ పాలనను వెక్కిరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల్నే కోసేస్తోంది!

నేరగాళ్లనే గెలుపు గుర్రాలుగా

బయట తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడే వ్యక్తులతో ఇక్కడ భుజం భుజం రాసుకొని తిరగాల్సి వస్తోందని ఉపరాష్ట్రపతిగా కృష్ణకాంత్‌ లోగడ వాపోయారు. నేరగాళ్లనే గెలుపుగుర్రాలుగా పార్టీలు చేరదీసి చట్టసభలకు గౌరవప్రదంగా నెగ్గిస్తుండటంతో భారత ప్రజాతంత్ర రూపురేఖలే భయానకంగా మారిపోయాయిప్పుడు. కాంగ్రెస్‌తో మొదలుపెట్టి, బీఎస్పీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో ఉట్టికొట్టి, పిమ్మట రెండు పర్యాయాలు ఎస్పీ శాసనసభ్యుడిగా చక్రం తిప్పి, నాలుగోసారి భాజపా పక్షాన గెలిచివచ్చిన సెంగార్‌ మాట మీరి ఆయన జిల్లాలో రాజకీయం చేయగల దమ్ము ఏ పార్టీకీ లేదు! తరతమ భేదాలతో అదే తరహా అరాచకం అన్నిచోట్లా తాండవిస్తోందనడంలో మరోమాట లేదు. కర్ర ఉన్నవాడిదే బర్రె చందంగా రాజ్యవ్యవస్థ మారిపోతే ప్రజాస్వామ్యం గతేంగాను?

రాజ్యాంగ లక్ష్యాలకు తలకొరివి

‘ఎమ్మెల్యే (సెంగార్‌)కు వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పే సాహసం చెయ్యరు. అతగాడి సోదరుడు జిల్లా ఎస్పీనే చంపడానికి ప్రయత్నించినా చట్టం ఏం చెయ్యలేకపోయింది’. ఉన్నావ్‌ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పులోని అంశాలివి. ఎవరు ఎంతటివారైనా రాజ్యాంగం చట్టం వారికంటే ఉన్నతమైనవన్న రాజ్యాంగ లక్ష్యాలకు ఆ వ్యాఖ్యలు అక్షరాలా తలకొరివి! పోలీసులు, దర్యాప్తు విభాగాలు అలాంటి నేరగాళ్లకు ఊడిగం చెయ్యడానికే ఉన్నట్లుగా పోనుపోను పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ అవ్యవస్థకు అగ్ని సంస్కారం చేసి చట్టబద్ధ పాలనకు పార్టీలు కట్టుబడతాయా? నేరగ్రస్త రాజకీయ భస్మాసుర హస్తాన్ని తమ నెత్తినే పెట్టుకొంటాయా? తేల్చుకోవాల్సిన సమయమిది!

- పర్వతం మూర్తి

ABOUT THE AUTHOR

...view details