అవకాశం ఉంటే న్యాయమూర్తులు అధిక కాలం పనిచేసేందుకు సిద్ధమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చేసిన సూచనపై స్పందించిన ఆయన బార్కౌన్సిల్ సభ్యుడిగా ఇది తన అభిప్రాయమని, సీజేఐగా మాత్రం కాదని స్పష్టం చేశారు.
"న్యాయమూర్తుల పదవీకాలం గురించి అటార్నీ జనరల్ చెప్పినదాని గురించి నేనేమీ అనను. వేణుగోపాల్ బార్ సభ్యునిగా ప్రసంగించారు. నేను కూడా బార్ సభ్యునిగానే చెబుతున్నాను. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంచితే సుదీర్ఘంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం."
- జస్టిస్ ఎస్ఏ బోబ్డే, భారత ప్రధాన న్యాయమూర్తి
భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 18న జస్టిస్ బోబ్డే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయవాదుల వయసుపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రస్తావించారు.