కరోనా లాక్డౌన్ సాధారణ పౌరులకే కాదు.. న్యాయమూర్తులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. వైరస్ కారణంగా విమానాలు, రైలు ప్రయాణాలు రద్దు అయిన నేపథ్యంలో గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ విశ్వనాథ్ సోమద్దర్ రెండువేల కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తోంది.
సోమవారం మధ్యాహ్నం వరకు ప్రయాణమే
కోల్కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దీపాంకర్ దత్తా.. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇప్పటికే కుటుంబాన్ని ముంబయికి పంపించారు జస్టిస్ దత్తా. బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం కుమారుడితో కలిసి కారులో ముంబయికి బయలుదేరారు. ఇందుకోసం ఆయన రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాతే ఆయన ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.