తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు - అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు

న్యాయమూర్తుల జీవితాలేమీ పూలపాన్పులు కాదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, అభాండాలు వస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను తాము సమర్థించుకొనే స్వేచ్ఛ లేకపోవడంతో న్యాయమూర్తులు ఇతరులకు సున్నితమైన లక్ష్యాలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Judges are now soft targets with advent of social media: Justice Ramana
అభాండాలకు బాధితులు న్యాయమూర్తులు

By

Published : Sep 13, 2020, 5:52 AM IST

తమను తాము సమర్థించుకొనే స్వేచ్ఛ న్యాయమూర్తులకు లేకపోవడంతో ఇతరులకు వారు సున్నితమైన లక్ష్యాలుగా మారుతున్నారని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. న్యాయమూర్తులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్న అపోహ చాలామందిలో ఉన్నా జడ్జీల జీవితాలేమీ పూలపాన్పులు కాదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, అభాండాలు వస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.బానుమతి రచించిన "జ్యుడీషియరీ, జడ్జెస్‌ అండ్‌ ద అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌" పుస్తకం విడుదల కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేతో కలిసి శనివారం ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో దీనిని నిర్వహించారు.

"న్యాయమూర్తులు తమను తాము సమర్థించుకొనే క్రమంలో స్వీయ నియంత్రణ పాటిస్తుంటారు. అందువల్ల విమర్శలు గుప్పించడానికి వారిని సున్నితమైన లక్ష్యాలుగా ఇతరులు ఎంచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, సాంకేతికత వ్యాప్తితో ఈ అంశం మరింత సంక్లిష్టంగా మారింది. వదంతులు, అపవాదులతో కూడిన సామాజిక మాధ్యమ పోస్టులకు న్యాయమూర్తులు బాధితులుగా మిగులుతున్నారు."

- జస్టిస్‌ రమణ, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి

న్యాయవ్యవస్థ స్వతంత్రత, జవాబుదారీతనం, నిజాయతీ, నిబద్ధత, నైతికత, నిష్పాక్షికత, మనస్సాక్షి, వ్యక్తిగత ప్రవర్తనలో నిబద్ధతలను గురించి జస్టిస్‌ బానుమతి ఈ పుస్తకంలో రాశారు. జస్టిస్‌ రమణ కీలకోపన్యాసం చేస్తూ- జస్టిస్‌ బానుమతి దశాబ్దాల అనుభవాలకు ఈ పుస్తకం అద్దం పడుతుందని చెప్పారు. సమున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులు ఎలా సేవచేయాలన్నది ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తుందన్నారు. బాహ్య ప్రపంచంలో పరిణామాలపై ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడారు.

ఇతరులు అర్థం చేసుకోవడం కష్టం

'న్యాయమూర్తులు పాలరాతి మేడల్లో విలాసవంతమైన జీవితం గడుపుతుంటారని చాలామంది అపోహపడుతుంటారు. కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నం. ఇతరులు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరిగా అర్థం చేసుకోగలిగేది న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు మాత్రమే. నియంత్రణలు, బంధుత్వాల మధ్య వాళ్లే సాధారణంగా నలిగిపోతుంటారు. వాళ్లూ త్యాగాలు చేయాల్సి వస్తోంది. స్వతంత్రంగా ఉండడానికి న్యాయమూర్తులు తమ సామాజిక జీవితాన్ని చాలా సమతౌల్యం చేసుకోవాల్సి ఉంటుంది. స్వీయ ప్రకటిత ఆంక్షల్లో నడుచుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తి మీదే ఉంటుంది. ఇతరుల కంటే జడ్జీల జీవితాలు మెరుగైనవేమీ కాదు అని జస్టిస్‌ రమణ వివరించారు.

స్వతంత్ర న్యాయమూర్తులపైనే దేశ భవిష్యత్తు

'ప్రస్తుత రోజుల్లో మిగతా వృత్తుల వారికంటే న్యాయమూర్తులు అత్యధిక త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నట్లు నేను నమ్ముతున్నా. బలమైన స్వతంత్ర న్యాయమూర్తులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి అది అవసరం. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు కీలకమైన షరతు.. న్యాయమూర్తి వ్యక్తిగత స్వాతంత్య్రమే. అది రాజ్యాంగ సిద్ధాంతం. న్యాయమూర్తికి మరో యజమాని లేరు అని ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరోన్‌ బరాక్‌ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి' అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

అత్యుత్తమ న్యాయమూర్తుల్లో బానుమతి ఒకరు

న్యాయవ్యవస్థకు జస్టిస్‌ బానుమతి ఎనలేని సేవలు చేశారని జస్టిస్‌ రమణ కొనియాడారు. "జస్టిస్‌ బానుమతి కఠోర శ్రమ, పాటించిన విలువలు, స్వతంత్ర ఆలోచనా విధానం, విజ్ఞానం ఎవరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిర్భయంగా, డైనమిక్‌గా సేవలందించారు. న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు రెండింటిలోనూ సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. న్యాయ కుటుంబంలోని అందరి పనితీరునూ ఆమె నాలుగు అధ్యాయాల్లో ప్రస్తావించారు. న్యాయవ్యవస్థలో ఇటీవలి మార్పుల గురించి రెండో అధ్యాయంలో చెప్పిన విషయాలు పాఠకులకు అవగాహనను పెంచుతాయి. మూడో అధ్యాయంలో న్యాయప్రక్రియ, న్యాయమూర్తుల విధుల గురించి చెప్పారు. న్యాయవ్యవస్థలో జరిగే జాప్యాలకు కారణాలతోపాటు, కేసుల నిర్వహణను సమర్థవంతంగా కొనసాగించాల్సిన ప్రాధాన్యం గురించి నాలుగో అధ్యాయంలో వివరించారు" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేం: సీజేఐ

న్యాయమూర్తులు కేవలం తీర్పులు, న్యాయపరమైన విధుల ద్వారా తప్పితే ఎక్కడా తమ సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేరని సీజేఐ బోబ్డె పేర్కొన్నారు. డేవిడ్‌ పన్నిక్‌ రాసిన 'జడ్జెస్‌' అన్న పుస్తకాన్ని ఉదహరిస్తూ "ఇతరులు చేయడానికి ఇష్టపడని పనులను చేయడానికి న్యాయమూర్తులను పిలుస్తారు" అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు తమ స్వతంత్రతను కాపాడుకుంటూనే పనిలో తమను తామే అధిగమించిపోవాలని అభిప్రాయపడ్డారు.

"న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై విమర్శలు చేస్తున్నవారి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్న చట్టం, యంత్రాంగాలే న్యాయమూర్తుల భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాయి."

-జస్టిస్‌ బోబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఇటీవల న్యాయవ్యవస్థపై వచ్చిన విమర్శల గురించి ఆయన ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ అనేది దేశానికి చెందుతుందని, ఆ వ్యవస్థ విజయాలు అనేకమంది చిత్తశుద్ధి, అంకితభావాలకు ఫలితమేనని చెప్పారు. రాజ్యాంగం ప్రబోధించిన లక్ష్యాలను సాధించడానికి న్యాయవ్యవస్థకు స్వతంత్రత తప్పనిసరి అని తెలిపారు. కరోనా అనంతరం కోర్టులకు కేసులు వెల్లువెత్తుతాయని, ఇప్పటికే చాలా కేసులు పెండింగులో ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా కొన్నింటిని పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ పాల్గొన్నారు.

న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై విమర్శలు చేస్తున్నవారి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతున్న చట్టం, యంత్రాంగాలే న్యాయమూర్తుల భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించాయి.- జస్టిస్‌ బోబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABOUT THE AUTHOR

...view details