వేలాది మంది విద్యార్థుల నిరసన గళంతో దిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయ ప్రాంగణం హోరెత్తింది. పెంచిన ఫీజులు, ఇతర సమస్యలపై.. ఉదయం నుంచి విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనలు చేస్తున్న విదార్థినిలను మహిళా పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని పంపించడానికి విఫలయత్నం చేశారు.
ఉదయం నిరసనలు చేసే క్రమంలో విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం వల్ల ట్రాఫిక్ స్తంభించింది. జేఎన్యూ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరైన సమయంలో విద్యార్థులు ఆందోళనకు దిగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. భారీ సంఖ్యలో వర్సిటీ వద్దకు చేరుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్నారు. 'దిల్లీ పోలీస్ గోబ్యాక్' అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు.