దిల్లీలోని జవహర్లాల్ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పెంచిన ఫీజులకు నిరసనగా.. జేఎన్యూ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడం వల్ల ప్రాంగణమంతా హోరెత్తింది. వేల మంది విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది.
ఫీజుల పెంపుపై తమతో మాట్లాడటానికి వైస్ ఛాన్సలర్ సిద్ధంగా లేరని విద్యార్థులు వెల్లడించారు. యాజమాన్యం ప్రవర్తన వల్ల తమకు నిరసనలు చేయడం తప్ప వేరే మార్గం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"వైస్ ఛాన్సలర్, హాస్టల్ యాజమాన్యం సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇది ఎంతో దారుణంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫీజును 999.9శాతం పెంచారు. డ్రెస్ కోడ్స్, కర్ఫ్యూ సమయాలను అమలు చేయాలని చూస్తున్నారు. మా నిరసనలకు ఇవే కారణం. జేఎన్యూ వ్యవస్థపై దాడి జరుగుతోంది. ఇందులో వైస్ ఛాన్సలర్ పాత్ర కూడా ఉంది. నిరసనలు చేపట్టడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ఫీజు పెరిగితే విద్యా వ్యవస్థ ఓ వస్తువులా మారిపోతుంది. 40 శాతం మంది చదువులు ఆపేయాల్సి వస్తుంది. మిగిలిన విద్యార్థులపై ఆర్థిక భారం ప్రతియేటా చాలా పెరుగుతుంది. ఆందోళనలు అత్యవసరం. మా వైస్ ఛాన్సలర్ విద్యార్థి సంఘాలతో మాట్లాడటానికి సిద్ధంగా లేరు."
-- జేఎన్యూ విద్యార్థి.