తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ: విలువల నిలయంలో ఎందుకీ వివాదాలు?

జేఎన్​యూ.... ఇటీవల అపవాదులు మూటగట్టుకుంటూ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పద అంశాలకు కేంద్రంగా ఉంటూ.. స్థాయి దిగజార్చుకుంటోంది. ఒకప్పుడు సైద్ధాంతిక రాజకీయ వివాదాలకే పరిమితమైన వర్సిటీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో వీసీ జగదీశ్​ కుమార్​ నిర్లక్ష్యమూ స్పష్టమవుతోంది. ఆయన చర్యలతో... ఖ్యాతి చెందిన జవహర్​లాల్​ నెహ్రూ వర్సిటీ కీర్తి కోల్పోతోంది. అసలు.. అల్లర్లు, సంక్షోభానికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నాలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి వీసీ ఎక్కడైనా ఉంటారా అనేలా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

One outrage after another and now this kind of violence.
జేఎన్​యూ: విలువల నిలయంలో ఎందుకీ వరుస వివాదాలు?

By

Published : Jan 10, 2020, 5:01 PM IST

Updated : Jan 10, 2020, 6:12 PM IST

దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్​యూ).... దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. అత్యున్నత విద్యా ప్రమాణాలకు పెట్టింది పేరు. రాజకీయ, సామాజిక అంశాలపై లోతైన అవగాహన కలిగిన విద్యార్థి సంఘాల మధ్య జేఎన్​యూలో జరిగే ఎన్నికలు యావద్భారతంలోనే ఎంతో ప్రత్యేకం. సైద్ధాంతికంగా ఎన్ని వైరుద్ధ్యాలున్నా... హింసకు తావులేకుండా, విభేదాల్ని సంవాదాల వరకే పరిమితం చేసిన విద్యాలయంగా జేఎన్​యూకు పేరుంది.

కానీ... ఇదంతా గతం. జేఎన్​యూ స్థాయి ఇటీవల గణనీయంగా దిగజారుతూ వస్తోంది. జనవరి 5న జరిగిన ఘటనతో పరిస్థితులు మరింతగా క్షీణించాయి. అత్యంత భయానక హింసాత్మక ఘటనకు వేదికైంది జేఎన్​యూ. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన విద్యార్థుల అరుపుల దృశ్యాలు, రక్తపు మరకలతో నిండిన ముఖాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా ఛానళ్లు ఈ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఈ ఘర్షణల కేంద్రంగానే చర్చలు నడిచాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి ఊతం...

మోదీ ప్రభుత్వ జనాదరణ లేని నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి.. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనలు పెద్ద ఎత్తున దోహదం చేస్తున్నాయి. విపక్ష నేతలు, బాలీవుడ్​ ప్రముఖులు ఘటనను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా హిందీ అగ్రనటి దీపికా పదుకొణె వర్సిటీని సందర్శించి... ఘటనలో గాయపడ్డ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్​కు సంఘీభావం ప్రకటించడం గమనించదగ్గ అంశం. సాధారణంగా ఎక్కడైనా సినీ పరిశ్రమల నుంచి ఇలాంటి ఘటనల్ని ఖండిస్తే ప్రభుత్వాలు దిగొచ్చిన సందర్భాలున్నాయి. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం అదే మొండివైఖరి కనబరుస్తోంది. ఏ మాత్రం వెనక్కి తగ్గనన్నట్లు సంకేతాలిచ్చింది.

జామియాలో అలా.. జేఎన్​యూలో ఇలా..

సరిగ్గా జేఎన్​యూ ఘటనకు 3 వారాల కిందట.. జామియా వర్సిటీలో చెలరేగిన అల్లర్లలో పోలీసులు వెంటనే స్పందించారు. అదే.. జేఎన్​యూలో ఇది ఆలస్యమవడం తేటతెల్లమైంది. ఈ రెండు ఘటనల మధ్య గమనించాల్సిన అంశం ఒకటుంది. జామియా ఘటన జరిగిన సమయంలో.. విద్యార్థులందరినీ బయటకు పంపించగా, జేఎన్​యూ హింసలో మాత్రం ముసుగులు ధరించిన బయటి వ్యక్తుల్ని గాలికొదిలేయడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదే అందరిలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.

ఒకప్పుడు సైద్ధాంతిక వైరం.. ఇప్పుడు హింస..

స్వరాజ్​ అభియాన్​ నేత యోగేంద్ర యాదవ్​ కూడా జేఎన్​యూ దాడికి బాధితులే. ఆయన్ను వర్సిటీ గేటు బయట కొందరు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. "ఒకప్పుడు జేఎన్​యూపై సైద్ధాంతికపరమైన దాడులు జరిగేవి. కొందరు విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెట్టడం వంటివి ఇందుకు ఉదాహరణ. కానీ ఇప్పుడు ఇది భౌతిక హింసగా మారింది" అన్నది యోగేంద్ర మాటల సారాంశం.

యోగేంద్ర వ్యాఖ్యల్ని పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. మొదట్లో స్వపన్​ దాస్​గుప్తా, చందన్​ మిత్రా వంటి భాజపా మేధావులు మాటలతోనే జేఎన్​యూపై ఇలాంటి సైద్ధాంతిక దాడులు చేసేవారు. జేఎన్​యూలో ప్రాబల్యం కలిగిన వామపక్ష వాదులు... హిందుత్వ భావజాలమున్న వారిని ఎదగకుండా చేశారన్నది వారి ఆరోపణ. ఒక్క నిమిషం పాటు ఇందులో వాస్తవముందని అంగీకరిద్దాం. అయితే.. విద్యారంగ సమస్యలు, జాతీయవాదం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై మోదీ విధానాలను వ్యతిరేకించే వామపక్ష వాదుల్ని సమర్థంగా తిప్పికొట్టగలవారు మితవాదుల్లో ఎవరున్నారు..? భాజపాకు మేధోవాదంతోనే అసలు సమస్య ఉన్నట్లుంది. ఇదే.. జేఎన్​యూలో సైద్ధాంతిక దాడిని మరో స్థాయికి తీసుకెళ్లింది.

జగదీశ్​ కుమార్​ కాలంలోనే విధ్వంసాలు...

గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జేఎన్​యూలో దాడులు జరుగుతున్నాయి. అదీ ప్రస్తుత వైస్-ఛాన్సలర్ ఆచార్య మామిడాల జగదీశ్​ కుమార్ పదవీకాలంలోనే కావడం గమనార్హం.

గత 70 రోజులుగా వర్సిటీలో సాధారణ విద్యాకార్యకలాపాలకు ఆటంకం కలిగిందంటేనే సంక్షోభానికి ముగింపు పలకేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యంతో కలిసి.. డిసెంబర్‌లో సమస్యను పరిష్కరించే అవకాశం స్పష్టంగా ఉన్న సమయంలో సెక్రటరీ బదిలీ పలు అనుమానాలను రేకెత్తించింది.

ఈ-మెయిల్​లో పరీక్షలట...

జేఎన్​యూలో హింస అనంతరం జగదీశ్​ కుమార్ మౌనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ​వైస్ ఛాన్సలర్ కనీసం విశ్వవిద్యాలయాన్ని సరైన దిశలో నడిపించేందుకు ఆసక్తి చూపలేదు. ఇంకా దాని ప్రతిష్ఠను మరింత దిగజార్చారు. వీసీ పర్యవేక్షిస్తున్న అధ్యాపకుల నియామకాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంకో ఆశ్చర్యకర నిర్ణయం మరొకటి ఉంది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల దృష్ట్యా విద్యాలయం మునుపటి సెమిస్టర్ పరీక్షల ఈమెయిల్​ ద్వారా నిర్వహించాలనుకున్నారట. మెయిల్​లో లేదా వాట్సాప్​లో సమాధానాలు రాయాల్సిందిగా నిర్ణయించారట. అయితే.. ఇందుకు వర్సిటీ అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇలాంటి వీసీని చూసి ఉండరు...!

చివరిగా ఈ అంశంలో నాణేనికి మరో వైపు కూడా ఉంది. ప్రముఖంగా టెలివిజన్​ యాంకర్​ అర్నబ్​ గోస్వామి గురించి మొదట చెప్పుకోవాలి. జేఎన్​యూ ఘటన ఆసాంతం వర్సిటీకి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం కల్పించడంలో తనవంతు కృషి చేశారన్న పేరు తెచ్చుకున్నారు. ఇక్కడే... వీసీ చొరవ గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. వర్సిటీపై అపవాదును తొలగించేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదు. దేశంలోని ప్రముఖ వర్సిటీ.. జేఎన్​యూ ఖ్యాతి దిగజారుతున్నప్పటికీ ఒక వీసీ మౌనంగా ఉండటం ఎంత వరకు సమంజసం? అసలు ఏ వైస్​ ఛాన్సలర్​ అయినా అలా చేస్తారా..?

(రచయిత- అమిర్​ అలీ, సెంటర్​ ఫర్​ పొలిటికల్​ స్టడీస్​, జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ)

Last Updated : Jan 10, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details