తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో 'హేమంతం'.. కమలానికి ఎదురుదెబ్బ - jharkhand elections result

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి జయకేతనం ఎగురవేసింది. అధికార భాజపా ఓటమి మూటగట్టుకుంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్​ పోటీ చేసిన రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

JMM congress and RJD alliance set to form government in jharkhand
ఝార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి జయకేతనం

By

Published : Dec 24, 2019, 5:44 AM IST

Updated : Dec 24, 2019, 2:08 PM IST

ఝార్ఖండ్​లో 'హేమంతం'.. కమలానికి ఎదురుదెబ్బ

అధికార భాజపాకి ఝార్ఖండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌- ఆర్జేడీ కూటమి అధికారాన్ని కైవశం చేసుకుంది. కూటమి నేతగా హేమంత్‌ సోరెన్‌ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. 81 స్థానాలున్న శాసనసభ ఓట్ల లెక్కింపు సోమవారం రాత్రికి పూర్తయింది.

హేమంతం

ప్రభుత్వ ఏర్పాటుకు 41 స్థానాలు అవసరం కాగా జేఎంఎం 30 చోట్ల, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలవటం వల్ల ఆ కూటమికి 47 స్థానాలు లభించినట్లయింది. ఒంటరిగా పోటీ చేసిన భాజపా 25 స్థానాలకే పరిమితమయింది. మిగిలిన 9 సీట్లు ఇతర పార్టీలకు దక్కాయి. ఆరుగురు మంత్రులు, సభాపతి ఇంటిదారి పట్టారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల భాజపా గెలవలేకపోయింది. గత ఏడాది భాజపా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కోల్పోగా ఇటీవల మహారాష్ట్ర, ఇప్పుడు ఝార్ఖండ్‌ చేజారిపోయాయి. దేశంలో ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సొంతంగానో, సంకీర్ణ భాగస్వామిగానో అధికారంలో ఉన్నట్లయింది.

భంగపడ్డ భాజపా

2019 మే సార్వత్రిక ఎన్నికల్లో ఝార్ఖండ్‌లో 55% ఓట్లు సాధించిన కమలనాథులు... ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 33% వద్ద ఆగిపోయారు. గతంలో మహారాష్ట్ర, హరియాణాల్లోనూ దాదాపు ఇలాంటి పోకడే కనిపించింది. 370వ అధికరణం రద్దు, ముమ్మారు తలాక్‌ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు ఈసారి ఝార్ఖండ్‌లో తమను విజయానికి చేరువ చేస్తాయని భాజపా నేతలు విశ్వసించినా తుది ఫలితాలు నీళ్లుజల్లాయి. ఫలితాల సరళి వెల్లడైన వెంటనే హేమంత్‌ సోరెన్‌ తన తండ్రి శిబూసోరెన్‌ వద్దకు వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈసారి పోటీచేసిన రెండు స్థానాల్లోనూ హేమంత్‌ గెలిచారు. సాధారణంగా కమలానికి ఓటు వేసే పట్టణ ఓటర్లు ఈసారి ఆ 44లో 29 చోట్ల విపక్షాలవైపే మొగ్గు చూపించారు. తుది ఫలితంపై అది స్పష్టమైన ముద్ర వేసింది.

రఘుబర్​ రాజీనామా

ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను సోమవారం సాయంత్రం గవర్నర్‌ ద్రౌపది ముర్ముకు అందజేశారు. నూతన సర్కారు ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ ఆయన్ని కోరారు. విజయం సాధించిన హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని కూటమిని ప్రధాని మోదీ అభినందించారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

ఇదీ చూడండి:మోదీ 'ఎన్​ఆర్​సీ' వ్యాఖ్యలపై విపక్షాల విమర్శలు

Last Updated : Dec 24, 2019, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details