ఝార్ఖండ్‌లోని ఖార్సావాన్ జిల్లాలో దారుణం జరిగింది. మోటారు సైకిల్ దొంగలించాడనే అనుమానంతో 24 ఏళ్ల ముస్లిం యువకుడు తాబ్రేజ్ అన్సారీని కొందరు మూకుమ్మడిగా కొన్ని గంటలపాటు చితకబాదారు. ఆ తర్వాత జైశ్రీరామ్, జై హనుమాన్ అనాలంటూ చావగొట్టారు. దెబ్బలు తట్టుకోలేక చికిత్స పొందుతూ అన్సారీ ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 18 రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటికి వెళుతుండగా..
ఆ రోజు జంషెడ్‌పుర్ నుంచి ఇంటికి స్నేహితులతో కలిసి వస్తున్న అన్సారీని, మరికొందరు స్నేహితులను మోటారు సైకిల్ దొంగలించాడని ధాట్కిదీ గ్రామస్థులు కొందరు అడ్డగించారు. స్నేహితులు ఎలాగోలా తప్పించుకున్నా.. అన్సారీ తప్పించుకోలేకపోయాడు. దొరికిన అన్సారీని చిత్రహింసలు పెట్టారు. కొన్ని గంటలపాటు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు.