కేంద్రప్రభుత్వం సోమవారం జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాష్ట్రాన్ని.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్గా విభజించింది. ఇప్పటికే ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో వైశాల్యపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా నిలవనుంది జమ్ముకశ్మీర్. దాని తర్వాతి స్థానంలో లద్దాఖ్ ఉండనుంది.
కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. లద్దాఖ్ ప్రజల్లో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. విభజన బిల్లును అక్కడి కొన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.
దిల్లీ, పుదుచ్చేరి సరసన జమ్ముకశ్మీర్...
ప్రస్తుతం ప్రకటించిన రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 9 కేంద్రపాలిత ప్రాంతాలు కానున్నాయి. వీటిలో దిల్లీ, పుదుచ్చేరిలకు శాసనసభలు ఉండగా.. ఇపుడు జమ్ముకశ్మీర్ ఈ జాబితాలో చేరింది. దమన్ దీవ్, దాద్రానగర్ హవేలీ, చండీగఢ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండగా.. లద్దాఖ్ వీటి సరసన చేరింది. యూటీల్లో దిల్లీ నుంచి అత్యధికంగా ఏడుగురు ఎంపీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పుడు జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండనున్నారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.