జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కశ్మీర్ సరిహద్దు ప్రజలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును గత శుక్రవారం లోక్‌సభ ఆమోదించగా.. తాజాగా రాజ్యసభ పచ్చజెండా ఊపింది.
ఈ బిల్లుతో పాటు కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగించేందుకు హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానానికీ రాజ్యసభ ఆమోదం లభించింది. అంతకుముందు ఈ రెండు అంశాలపై సుదీర్ఘంగా జరిగిన చర్చకు సమాధానమిచ్చారు అమిత్ షా.
"ఉగ్రవాదం, అసహనం నిర్మూలనకు మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. జమ్ము కశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధిపై మరింత ముందుకు పోతాం. మా విధానంలో మేం స్పష్టంగా ఉన్నాం. భారత్‌ను విభజించాలని చూసేవాళ్లకు అదే తరహాలో సమాధానం చెబుతాం. నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. అసత్య ప్రచారాలను మీరు నమ్మకండి. మీరు భారత్‌తో కలిసి నడిస్తే మీ భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది."