రక్తహీనతను అధిగమించేందుకు ఓ వినూత్న మార్గం అనుసరిస్తున్నారు.. ఝార్ఖండ్‌లోని ఓ గ్రామస్థులు. అది కూడా ఓ ఇనుప కడాయి సాయంతో. వినేందుకు వింతగా ఉన్నా.. ఇనుప కడాయితో రక్తహీనతను జయించిన కొన్ని ఆదివాసీ గ్రామాలు ఖుతీ జిల్లా, టోర్పా నియోజకవర్గంలో ఉన్నాయి.
పాట పాడుతూ, పాలకూర వండుతున్న ఈ మహిళలను చూస్తే.. వారి జీవితాల్లో ఇనుప కడాయిలు ఎంత ముఖ్యమైన భాగంగా మారాయో తెలుస్తుంది. అయితే... వాటితో రక్తహీనత ఎలా తగ్గుతుంది? ఇనుపపాత్రలో వంట చేస్తే ఆ సమస్యే తలెత్తదని ఈ గ్రామీణ మహిళలకు ఎలా తెలిసింది? ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలంలో కావల్సినవి పండించుకోమని వారికి ఎవరు చెప్పారు?
"ఇనుప కడాయి వల్ల చాలా లాభాలున్నాయి. దాంట్లో ఆకుకూరలు వండితే రక్తహీనత సమస్య తగ్గుతుందని గర్భిణీలకు సూచిస్తాను. ఇనుప మూకుడులో కూరగాయలు వండుకుని, తినమని ఆడపిల్లలకు చెబుతాను. ఇది చాలా ఉపయోగకరం."
- పద్మినీ దేవి, టోర్పా గ్రామస్థురాలు
గ్రామస్థులంతా ఇనుప కడాయిని తప్పనిసరిగా వాడేలా ప్రోత్సహించింది ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా ఓ స్వచ్ఛంద సంస్థ పేరు వినిపించింది. అదే ట్రాన్స్‌ఫాం రూరల్ ఇండియా.
"వాళ్లు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో వారితోనే చర్చించాం. ఆ చర్చలో భాగంగా...వారికి ఎలాంటి మార్పు కావాలో నిర్ణయించుకుని మాకు చెప్పేలా ఒకరు బాధ్యత తీసుకోవాలని సూచించాం. మాతో కలిసి పనిచేయడానికి వాళ్లు సిద్ధంగా ఉంటే, మేం వారికి సాయం చేస్తాం."
- పంకజ్ జీవరాజక, టీఆర్ఐ మేనేజర్
సామాజిక బాధ్యత ఉన్న మహిళలను ఈ సంస్థ ఎంపిక చేసి, వారికి పరివర్తన్ దీదీ అని పేరుపెట్టింది. గ్రామీణ మహిళల ప్రవర్తన మార్చడం వీరి బాధ్యత. వివిధ గ్రామాలకు చెందిన వనితలు ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అలా ఓ వ్యవస్థ ఏర్పడింది.
"మొదట్లో చాలానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి, పరివర్తన్ దీదీలను ఎంపిక చేయడం మా బాధ్యత."