ఝార్ఖండ్ ఖూంటీ జిల్లా దారుణం జరిగింది. గిరిజన ప్రాబల్యముండే కుడా గ్రామంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల శిరచ్ఛేదం చేసిన మృతదేహాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వారి తలలను గ్రామానికి సమీపంలోని చెరువు వద్ద గుర్తించినట్లు తెలిపారు.
మృతులు బిర్సా.. అతని భార్య సుక్రుపూర్తి, కూతురు సోమవడిపూర్తిగా నిర్ధరించారు పోలీసులు. వీరంతా మూడు వారాల క్రితం అపహరణకు గురైనట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. వీరిపై క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కిరాతకానికి పాల్పడిన ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మంత్రాల నెపంతోనే చంపినట్లు నిందితులు అంగీకరించారు.
కూతురి ఫిర్యాదుతో..
బిర్సా పెద్ద కూతురు అక్టోబర్ 12న పుట్టింటికి వచ్చింది. అయితే, ఇంట్లో ఎవరూ లేకపోవటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సోమ, విశ్రమ్, రఘు అనే వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. వీరితో తమ కుటుంబానికి భూవివాదం ఉందని.. తన తల్లిని మంత్రగత్తె అంటూ ఊళ్లో ప్రచారం చేసినట్లు వివరించింది.
బిర్సా ఇంటిపై చాలా మంది దాడి చేసి వారిని అపహరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తప్పిపోయిన వారిని వెతికేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఖూంటీ ఎస్పీ అశుతోష్ శేఖర్.. ఈటీవీ భారత్తో వెల్లడించారు.
"సోమ, విశ్రమ్, రఘును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. వారు నేరాన్ని అంగీకరించారు. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న కారణంతోనే వారిని చంపినట్లు స్పష్టం చేశారు. వారిని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకే తలలు వేరు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని శేఖర్ తెలిపారు.
ఇదీ చూడండి:'ముంగేర్' హింసపై ఈసీ ఫైర్- ఎస్పీపై వేటు