తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఊహించని 'తీర్పు'తో భాజపాకు ఝలక్​..! - ఝార్ఖండ్​లో భాజపాకు ఘోర ఓటమి

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భాజపాకు ఊహించని షాక్​ ఇచ్చాయి. నేల విడిచి సాము చేస్తే కూసాలు కదిలిపోతాయని కమలనాథులకు తెలిసివచ్చేలా చేశాయి. ప్రధాని మోదీ, అమిత్‌ షా చెరో తొమ్మిది సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై ఎంతగా సర్దిచెప్పాలని ప్రయత్నించినా, భాజపా అయిదేళ్ల ఏలుబడిపై ఓటర్ల నిరసన అధికార మార్పునే అనుశాసించింది!

jharkhand election results shocks BJP
కమలనాథులకు కూసాలు కదిలేలా ఝార్ఖండ్‌ ఝలక్‌

By

Published : Dec 24, 2019, 7:09 AM IST

Updated : Dec 24, 2019, 9:40 AM IST

నేల విడిచి సాము చేస్తే రాజకీయంగా కూసాలు కదిలిపోతాయని కమలనాథులకు బోధపరచిన ఫలితాలివి. సాధారణ స్థాయి లక్ష్యాలు నిర్దేశించుకోవడమే నేరమంటూ 81 సీట్ల ఝార్ఖండ్‌ అసెంబ్లీలో 65కు పైగా స్థానాలకు గురిపెట్టి, కార్యవర్గ శ్రేణుల్ని కదం తొక్కించిన భాజపా- పట్టుమని పాతిక స్థానాలకే పరిమితమై మొహం వేలాడేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా 2.4 శాతం ఓట్ల శాతం పెరిగినా, డజను దాకా సీట్లు కోసుకుపోవడం భాజపా స్కంధావారాలకు ఏ మాత్రం మింగుడుపడనిది. క్రితంసారి ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)తో తెగతెంపులు చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమంటూ ఫలితాల్ని చూశాక లెంపలు వేసుకొన్న కాంగ్రెస్‌ ఈసారి జేఎంఎం, ఆర్జేడీలతో కలిసి కూటమిగా పోటీ చేయడం ద్వారా విజయానంద డోలికల్లో తేలిపోతోంది.

కూటమికి అలవోక మెజారిటీ

సాధారణ మెజారిటీ మార్కు 41 సీట్ల మైలురాయిని జేఎంఎం (30), కాంగ్రెస్‌ (16), ఆర్జేడీ (1) అలవోకగా అధిగమించాయి. కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిర భాజపా ప్రభుత్వాలతో రెండు ఇంజిన్ల సర్కారుగా రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేశామన్న ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ అతిశయ ధోరణులు, అర్జున్‌ ముండా లాంటి గిరిజనాకర్షక నేతనూ పక్కన పెట్టేసిన పోకడలు- అంతిమంగా పార్టీ పుట్టిని నిలువునా ముంచేశాయని కార్యకర్తలే మొత్తుకొంటున్నారు. 2014లో భాగస్వామ్య పక్షమైన ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ గెలిచిన అయిదు స్థానాలతో కలిపి భాజపా (37) సాధారణ మెజారిటీ దాటగలిగింది. గొంతెమ్మ కోర్కెలంటూ ఏజేఎస్‌యూతో పొత్తును కాలదన్నిన భాజపా- సాక్షాత్తు ముఖ్యమంత్రి సహా మరో ఆరుగురు మంత్రుల ఘోర పరాజయాన్ని నేడు జీర్ణించుకోలేకపోతోంది. క్రితంసారి 70వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన రఘువర్‌దాస్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి సీనియర్‌ నేత సరయు రాయ్‌ చేతిలో ఓటమిపాలు కావడం- క్షేత్రస్థాయి వాస్తవాలకు పార్టీ దూరం జరిగిందనడానికి తార్కాణం. 2014లో తొలిసారి భాజపా ఉత్థానంతో రాష్ట్రానికి దక్కిన రాజకీయ సుస్థిరత్వం ఈసారీ కొనసాగనుండటం సాంత్వన కలిగించే పరిణామం!

అస్థిర రాజకీయానికి నెలవుగా..!

కొత్త సహస్రాబ్ది తొలి వేకువలో దేశంలోనే మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రంగా ఆవిర్భవించిన ఝార్ఖండ్‌ తొలి పద్నాలుగేళ్ల ప్రస్థానమంతా అస్థిర రాజకీయ సంత. 288 సీట్లుగల మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే రోజు పోలింగ్‌ జరిపిన నిర్వాచన్‌ సదన్‌- 81 స్థానాల ఝార్ఖండ్‌కు అయిదు విడతల ఓట్ల పండగ జరపాల్సి రావడమే అక్కడి దుస్థితిగతులకు దాఖలా! రాష్ట్రంలోని ప్రతి అయిదు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు తీవ్రవాద శక్తుల పదఘట్టనల్లో నలుగుతున్నాయన్న ఈసీ- 2014లో మాదిరిగానే ఈసారీ అయిదంచెల పోలింగును నిర్వహించింది. ‘ఇదే తరహా ఖనిజ వనరులున్న ఆస్ట్రేలియా అద్భుతంగా పురోగమిస్తుంటే, ఝార్ఖండ్‌ ఇంకెన్నేళ్లు ఇలా సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడాలి?’ అన్న ప్రధాని మోదీ సూటి ప్రశ్నకు, ‘విస్పష్ట మెజారిటీ- విస్పష్ట ప్రగతి’ అన్న నినాదానికి రాష్ట్ర ప్రజ సానుకూలంగా స్పందించబట్టే రఘువర్‌దాస్‌ సర్కారు స్థిరంగా మనుగడ సాగించగలిగింది. అభివృద్ధి రాజకీయాలు చేద్దామంటూ అధికారానికి వచ్చిన భాజపా వివాదాస్పద భూ సమీకరణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా గిరిజనం విశ్వాసాన్ని కోల్పోయింది. గోరక్షక్‌ల పేరిట మూకహింస రాష్ట్రంలో 22మందిని బలిగొనడం, కఠిన చట్టాలు తెచ్చి క్రైస్తవుల్ని దూరం చేసుకోవడంతో- ప్రధానంగా అగ్రవర్ణాలు, ఓబీసీలే ఎన్నికల్లో తనకు తురుఫు ముక్కలు కాగలరని భాజపా తలపోసింది. ప్రధాని మోదీ, అమిత్‌ షా చెరో తొమ్మిది సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొని పౌరసత్వ చట్టంపై ఎంతగా సర్దిచెప్పాలని ప్రయత్నించినా, భాజపా అయిదేళ్ల ఏలుబడిపై ఓటర్ల నిరసన అధికార మార్పునే అనుశాసించింది!

కమలాన్ని నలుపుతున్న హస్తం!

రాష్ట్రం చిన్నదా పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా విస్తరణ వ్యూహాలకు సానపట్టి, సర్వశక్తులూ ఒడ్డి, గాలివాలుకు తెరచాపలెత్తడం ద్వారా గెలుపు తీరాలు చేరే నయా రాజకీయంలో కమలం పార్టీ కొన్నేళ్లుగా కొత్తపుంతలు తొక్కింది. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించి మొత్తం విపక్ష శిబిరమే బిత్తరపోయేలా 2017 డిసెంబరు నాటికి దేశంలో 71 శాతం పరగణాపై జయపతాక ఎగరేసింది. ఏడాది కాలంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తాజాగా ఝార్ఖండ్‌ కమలం పార్టీ చేజారిపోవడం గమనార్హం. కర్ణాటకలో ఒంటిచేత్తో ఉట్టికొట్టే ఊపు లేక, అధికార కూటమిలో చీలికల్ని ప్రేరేపించడం ద్వారా పాలన పగ్గాలు చేపట్టిన భాజపా- హరియాణాలోనూ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకొన్న దుష్యంత్‌ చౌతాలాతో అవసరార్థం చెలిమిచేసి పునరధికారం దక్కించుకొంది. రెండేళ్ల క్రితం దాకా ప్రతిపక్షాల పాదముద్రలే లేని స్థాయిలో సర్వం తానై సాగిన భాజపా విస్తరణ ప్రజాస్వామ్య మనుగడకు తీవ్రాఘాతకరంగా మారింది. విలువల క్షయంతో కుంగిన కాంగ్రెస్‌ సమకాలీన రాజకీయాల్లో కోల్పోతున్న స్థానాన్ని వడివడిగా భర్తీ చేయడమే ఏకైక అజెండాగా ఎదిగొచ్చిన భాజపా దూకుడు- అనేకచోట్ల ప్రాంతీయ పక్షాల అస్తిత్వానికీ ప్రమాదకరంగా మారింది. భాజపా జాతీయ అజెండా ఏదైనా ప్రాంతీయ స్థాయిలో ప్రజల ఆకాంక్షల చట్రంలో అది ఇమడకుంటే, పార్టీ పెద్దలు దాన్ని గుర్తించకుంటే- తలబొప్పి కట్టక తప్పదని జేఎంఎంకు అత్యధికంగా 30 సీట్లు అనుగ్రహించడం ద్వారా ఝార్ఖండ్‌ ప్రజ స్పష్టీకరిస్తోంది. మహారాష్ట్రలో భాజపాను నిలువరించగలిగిన విపక్ష కూటమికి ఝార్ఖండ్‌ గెలుపు కొత్త ఉత్సాహం కలిగించేదే. వచ్చే ఫిబ్రవరి నాటి దేశ రాజధాని దిల్లీ ఎన్నికలకు సంబంధించి, ఈ విజయం విపక్షాలకు నిస్సంశయంగా టానిక్కే!

ఇదీ చూడండి: ఝార్ఖండ్​లో 'హేమంతం'.. కమలానికి ఎదురుదెబ్బ

Last Updated : Dec 24, 2019, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details