మహారాష్ట్రలో శరద్ పవార్ అనుసరించిన ప్రచార సూత్రాన్ని పాటించి ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. అక్కడ ప్రచారంలో భాజపా జాతీయ అంశాలపై మాట్లాడితే పవార్ స్థానిక సమస్యలను ప్రస్తావించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఝార్ఖండ్‌లో ఇదే పునరావృతమయింది. భాజపా అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు పార్టీ కార్యకర్తలంతా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం, ఇస్లామిక్ దేశాల్లో మైనార్టీల దుస్థితి, పౌరసత్వ సవరణ చట్టం ఆవశ్యకత, అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరం నిర్మాణంపై ఊరూవాడా ప్రచారం చేశారు.
స్థానిక సమస్యలే ప్రధాన అస్త్రంగా..
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)-కాంగ్రెస్- ఆర్జేడీ మాత్రం జాతీయ, హిందుత్వ విషయాల జోలికి పోలేదు. తలుపుల్లేని మరుగుదొడ్లు, అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల నిర్మాణం పనులు, ప్రభుత్వ పథకాల్లో లోపాలు, అధికార యంత్రాంగంలో అవినీతిపై ప్రచారం చేశాయి. ప్రధాని మోదీ 12 బహిరంగ సభలు, హోం మంత్రి అమిత్ షా 15 బహిరంగ సభల్లో ప్రసంగించినా ఝార్ఖండ్ సమస్యలపై అంతగా దృష్టి కేంద్రీకరించలేకపోయారు. దీన్నే విపక్షాల కూటమి అవకాశంగా తీసుకొంది. రఘుబర్‌దాస్ ఏకపక్ష నిర్ణయాలు కూడా భాజపాను దెబ్బతీశాయి. పార్టీ అగ్రనాయకులు కూడా ఆయనపైనే అధికంగా ఆధారపడ్డారు.అన్నీ తానై వ్యవహరించడం వల్ల పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మిత్రపక్షాలను దూరం చేసుకోవడం, పార్టీ ఫిరాయింపుదార్లకు టిక్కెట్లు ఇవ్వడం నష్టపరిచాయి.
కలిసిరాని వర్గ సమీకరణాలు
భాజపాకు ఈసారి వర్గ సమీకరణాలు కూడా కలిసి రాలేదు. ఓబీసీ అయిన రఘుబర్ దాస్‌ను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసి ప్రయోజనం పొందింది. ఈసారి ఓబీసీ కార్డు పనిచేయలేదు. గిరిజనుల కోసమే బిహార్ నుంచి ఝార్ఖండ్‌ను విడదీశారని, అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిని గిరిజనులకు ఇవ్వడం సంప్రదాయం కాగా, దాన్ని భాజపా ఉల్లంఘించిందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడింది. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగేలా అటవీ హక్కుల చట్టం తెచ్చారని, గిరిజనులు నిరాశ్రయులవుతారని జేఎంఎం చేసిన ప్రచారం ఆకట్టుకొంది. దాంతో గిరిజనులు భాజపాకు దూరమయ్యారు. గతంలో లేని విధంగా రాష్ట్రంలోని 14.5 శాతం ముస్లింలు విపక్షాలకు మద్దతు పలికారు. వారు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయడం గమనార్హం. సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరక అఖిల ఝార్ఖండ్ విద్యార్థి సంఘం (ఏజేఎస్‌యూ) భాజపా కూటమిని వీడింది. ఓబీసీ అయిన కుర్మీ సామాజిక వర్గంపై, ముఖ్యంగా ఛోటానాగ్‌పుర్ ప్రాంతంపై ఈ విద్యార్థి సంఘానికి పట్టుంది. ఆ సంఘం 27 చోట్ల పోటీ చేయడం వల్ల భాజపా భారీగా నష్టపోయింది.