ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది వస్త్రధారణపై ఆంక్షలు విధించారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ డివిజన్ కమిషనర్ ఎంబీ ఓజా. ఫార్మల్గా, గౌరవప్రదమైన దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని ఆదేశించారు. కార్యాలయాల్లో జీన్స్, టీ షర్ట్లు ధరించటాన్ని నిషేధించారు. ఆదేశాలను విస్మరించే వారిపై క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అశోక్ నగర్ జిల్లాలో పర్యటించిన క్రమంలో సమావేశానికి అదనపు కలెక్టర్ సహా సీనియర్ అధికారులు జీన్స్ వేసుకుని రావటం ప్రభుత్వ అధికారుల వస్త్రధారణపై వివాదానికి దారితీసినట్లు చెప్పారు ఓజా. ఈ నేపథ్యంలో దుస్తులపై ఆంక్షలు విధిస్తూ డివిజన్ అధికారులు, కలెక్టర్లకు లేఖ రాశారు.