కన్నడనాట భాజపా - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం? కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంతో.. కుమారస్వామి సర్కారు నిలుస్తుందో లేదో అని రోజురోజుకు మరింత ఆసక్తి నెలకొంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావ్, పార్టీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్పతో జేడీఎస్ నేత సారా మహేశ్ గురువారం భేటీ అయ్యారు. ఈ తరుణంలో రాష్ట్రంలో జేడీఎస్-భాజపా సంకీర్ణ ప్రభుత్వం నెలకొనబోతోందా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇది యాదృచ్ఛిక భేటీ...
అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సాధారణ భేటీ అని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున కార్యచరణ జరుగుతోందని... అయినా వాటన్నింటికీ దీటుగా సమాధానమిస్తామని ట్వీట్ చేశారు. మరోవైపు యడ్యూరప్ప కూడా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని గతంలోనే తేల్చి చెప్పారు.
ముంబయికి తిరుగు పయనం
14 మంది కాంగ్రెస్-జేడీఎస్ నేతలు రాజీనామాలు చేసిన కారణంగా కుమారస్వామికి కంటిమీద కునుకులేకుండా పోయింది. సుప్రీం ఆదేశాలతో గురువారమే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించిన రెబల్ ఎమ్మెల్యేలు అనంతరం బెంగుళూరు నుంచి ముంబయికి తిరిగి వెళ్లిపోయారు.
తొందరపాటు నిర్ణయం తీసుకోను
ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీ విధానాల ప్రకారం రాజీనామాలు స్వచ్ఛందంగా, సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఈ తరుణంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై నెలకొన్న సందేహాలు తీరాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
నేటి నుంచి శాసనసభ సమావేశాలు
తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. ఆర్థిక బిల్లుల ఆమోదానికి వీలుగా కాంగ్రెస్ శాసనసభ్యులంతా సభకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. గైర్హాజరయ్యే సభ్యులపై అనర్హత వేటు వేస్తామని హెచ్చరించింది.