తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంక్షోభంలో కర్ణాటక సంకీర్ణ సర్కార్​ - కుమారస్వామి

కర్ణాటకలో కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో పార్టీ భవితవ్యం గందరగోళంలో పడింది. తాజాగా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాటపట్టారు. స్పీకర్​ నిర్ణయంపై ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉండగా.. గవర్నర్​ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది భాజపా. ఈ పరిణామాల నడుమ ఏ క్షణంలోనైనా కాంగ్రెస్​-జేడీఎస్​ సర్కారు కూలిపోయే అవకాశముంది.

సంక్షోభం అంచున కర్ణాటక సంకీర్ణ సర్కార్​

By

Published : Jul 7, 2019, 6:12 AM IST

Updated : Jul 7, 2019, 9:28 AM IST

సంక్షోభం అంచున కర్ణాటక సంకీర్ణ సర్కార్​

కన్నడ నాట రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గతేడాది జూన్​లో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఒడుదొడుకుల్లోనే సాగిన కుమారస్వామి ప్రభుత్వం చివరిదశకు చేరుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం ముగ్గురు జేడీఎస్​ సభ్యులతో సహా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేశారు. వారం కిందటే ఓ కాంగ్రెస్​ శాసనసభ్యుని రాజనామాతో ఆ సంఖ్య 14కు చేరింది.

ప్రభుత్వ ఏర్పాటు నుంచే...

ఆరంభం నుంచి కూటమిలో వైరుద్ధ్యాలున్నా.. లోక్​సభ ఎన్నికల అనంతరం అది తీవ్రమైంది. అంతర్గత కలహాలు, మాటలయుద్ధాలు, కాంగ్రెస్​ నేతల వివాదస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి స్థిరత్వం దెబ్బతింది. ఇదే అదనుగా కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు సాగించాయి. సమయం చిక్కినప్పుడల్లా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ అసంతృప్తుల్ని తమలో చేర్చుకునే దిశగా ప్రణాళికలు రచించాయి.

దీనికి తోడు లోక్​సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అంచనాలకు మించి రాణించడం కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమిని సందిగ్ధంలో పడేసింది. అనంతరం.. కూటమి స్థిరత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా...? కూలిపోనుందా..? అనే ప్రశ్నలు అందరినీ ఆలోచనలో పడేశాయి.

వరుస రాజీనామాలు...

శనివారం మొత్తం అత్యంత నాటకీయ పరిణామాలు సాగాయి. ఉదయం కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి రామలింగారెడ్డి నేతృత్వంలో 10 మంది శాసనసభ్యులు, జేడీఎస్​ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హెచ్​. విశ్వనాథ్​ ఆధ్వర్యంలో ముగ్గురు జనతా దళ్​ సభ్యులు.. స్పీకర్​ కార్యాలయానికి చేరుకున్నారు. సభాపతి లేనందున కార్యదర్శికి రాజీనామాలు అందజేశారు. అనంతరం గవర్నర్​ వాజూబాయివాలానూ కలిసి రాజీనామాలు సమర్పించారు.

అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కాంగ్రెస్​ మంత్రి డీకే. శివకుమార్​ స్పీకర్​ కార్యాలయానికి వెళ్లినా ప్రయత్నాలు ఫలించలేదు. వారినెవరూ నిలువరించలేకపోయారు.

గోవా.. కాదు కాదు ముంబయి..

గవర్నర్​కు రాజీనామాలు సమర్పించిన అనంతరం.. 10 మంది ఎమ్మెల్యేలు మొదట బెంగళూరు నుంచి గోవా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అనంతరం.. నిర్ణయం మార్చుకొని ముంబయికి చేరుకున్నారు. రాజీనామాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్​ శాసనసభ్యులు బెంగళూరులోనే ఉండిపోయారు.

స్పీకర్​ నిర్ణయం మంగళవారం...

రాజీనామాలను స్వీకరించిన స్పీకర్​.. మంగళవారం వీటిపై విచారణ చేపడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్పీకర్​ ​ రాజీనామాలను ఆమోదిస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

తగ్గనున్న మెజారిటీ...

రాజీనామాలు ఆమోదిస్తే.. విధాన సభలో సంకీర్ణ సర్కార్​ బలం తగ్గిపోతుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో భాజపా బల నిరూపణకు పట్టుబడితే.. సర్కార్​ కూలిపోయే అవకాశముంది. గవర్నర్​ ఆహ్వానిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించిన కాషాయ పార్టీ.. రాజీనామాలతో తమకేం సంబంధం లేదని అంటోంది.

  1. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు 118 మంది. మేజిక్​ నంబరు కంటే ఇది 5 స్థానాలు అధికం.
  2. 14 మంది రాజీనామాల్ని స్పీకర్​ ఆమోదిస్తే.. సంకీర్ణ కూటమి బలం 104కు పడిపోతుంది. అప్పుడు 210 స్థానాల అసెంబ్లీలో మేజిక్​ సంఖ్య 106కు రెండడుగుల దూరంలో నిలిచిపోతుంది కుమారస్వామి సర్కార్​.

కాంగ్రెస్​ ప్రయత్నాలు...

14 మంది శాసనసభ్యుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న కర్ణాటక ప్రభుత్వాన్ని.. కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేపట్టింది హస్తం పార్టీ​. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయి వెళ్లగా.. తాజా పరిణామాలపై కాంగ్రెస్​ నేతలు బెంగళూరులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కర్ణాటక ప్రస్తుత పరిస్థితిపై దిల్లీలో కాంగ్రెస్​ సీనియర్లు భేటీ అయ్యారు. చిదంబరం, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్​, అహ్మద్​ పటేల్​లు సమావేశమై చర్చించారు. భాజపా అగ్రనాయకత్వం, మోదీ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని విమర్శించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

Last Updated : Jul 7, 2019, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details