తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: జాప్యంతో ఊపిరి పీల్చుకున్న సర్కారు - ఎమ్మెల్యేలు

కన్నడనాట రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజీనామాలు సమర్పించిన 14 మంది రెబల్​ ఎమ్మెల్యేలలో 9 మంది రాజీనామాలు నిబంధనల మేరకు లేవని స్పీకర్  రమేశ్​ కుమార్ ప్రకటించారు. సరిగా రాజీనామా పత్రాలు సమర్పించిన ఐదుగురు ఎమ్మెల్యేలు వాదనలు వినిపించాలని కోరారు. భాజపా పక్షాన చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం మేరకు అనర్హత వేటు వేయాలని.. 6 నెలలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సభాపతిని కాంగ్రెస్ కోరింది.

కర్ణాటకీయం: జాప్యంతో ఊపిరిపీల్చుకున్న సర్కారు

By

Published : Jul 10, 2019, 5:13 AM IST

Updated : Jul 10, 2019, 7:33 AM IST

కర్ణాటకీయం: జాప్యంతో ఊపిరిపీల్చుకున్న సర్కారు

పతనం అంచుల్లో చిక్కుకున్న కర్ణాటక సంకీర్ణ సర్కారుకు స్పీకర్​ ప్రకటన కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. రాజీనామాలు చేసిన 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్​ ఎమ్మెల్యేల్లో 9 మంది రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్‌లో లేవని కర్ణాటక సభాపతి కేఆర్ రమేశ్​ కుమార్ తెలిపారు.

అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన శివాజీనగర్‌ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని పరిశీలించాల్సి ఉందని రమేశ్​ కుమార్ వెల్లడించారు.

కాంగ్రెస్​ ఫిర్యాదు...

భాజపా నేతలకు మద్దతిస్తోన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం మేరకు వేటు వేయాలని మరోవైపు కాంగ్రెస్ సభాపతిని కోరింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్జాజరయ్యారు. వారూ రెబల్స్‌తో జతకట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మాత్రం ఆరోగ్య, ఇతర సమస్యలతో ఏడుగురు ఎమ్మెల్యేలు అనుమతి తీసుకునే రాలేదని తెలిపింది.

అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ లీగల్ సెల్ చేసిన ఫిర్యాదులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కర్ణాటక స్పీకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలూ సభాపతిని కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల వెనుదిరిగారు.

బుజ్జగింపు చర్యలు...

మరోవైపు జేడీఎస్​ ఎమ్మెల్యేలంతా కనీసం 4 రోజులు దేవనహళ్లిలోని గోల్ప్‌షైర్‌ క్లబ్‌లోనే ఉండాలని కుమారస్వామి కోరారు. కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు పుణెకు 90 కిలోమీటర్ల దూరంలోని అజ్ఞాత ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నేడు ముంబయి వెళ్లి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చించనున్నట్లు సమాచారం.

రంగంలోకి ఆజాద్...

కర్ణాటక సంకీర్ణ సర్కార్‌ను కాపాడే బాధ్యతను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్‌లకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కట్టబెట్టారు. ఈ మేరకు ఇద్దరూ వెంటనే బెంగుళూరు తరలి వెళ్లారు.

Last Updated : Jul 10, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details