సీనియర్ నటి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయప్రద బుధవారం కన్నీటి పర్యంతమయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ వల్లే 2014లో రాంపూర్ వదిలి దూరంగా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసిడ్ దాడి చేస్తామని అప్పట్లో కొందరు తనను బెదిరించారని కంటతడి పెట్టుకున్నారు.
" నేను రాంపూర్‌ను గతంలో విడిచివెళ్లడానికి, క్రియాశీలక రాజకీయాలకు దూరమవడానికి కారణం... కొందరు నాపై యాసిడ్ దాడి చేసేందుకు ఆలోచనలు చేయడమే. నన్ను అప్పట్లో లక్ష్యంగా చేసుకున్నారు."-- జయప్రద, రాంపూర్ భాజపా అభ్యర్థి
జయప్రద కన్నీరు పెట్టుకోగానే.... "పోరాడండి.. జై జయప్రద, వందేమాతరం" అంటూ నినాదాలు చేశారు భాజపా కార్యకర్తలు.