కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ తోసిపుచ్చింది. లాక్‌డౌన్ విధించినప్పుడు కేసుల రెట్టింపు సమయం 3 రోజులు ఉండగా.. ఇప్పుడు 13రోజులకు పెరిగిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ గుర్తుచేశారు. ఇది భారత్ సాధించిన విజయమన్నారు. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించారని ప్రపంచమంతా భారత్‌ను ప్రశంసిస్తుంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ మాత్రం రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జావడేకర్ ఆరోపించారు.
'భారత్‌ను ప్రపంచం ప్రశంసిస్తుంటే.. కాంగ్రెస్ తప్పుపడుతోంది' - భాజపా కాంగ్రెస్ విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మండిపడ్డారు. లాక్‌డౌన్ విఫలమైందన్న రాహుల్ మాటలను తప్పుపట్టారు. కరోనా కట్టడి కోసం దేశం చేపట్టిన చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతుంటే.. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ విధించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందని విమర్శలు చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి ఇది అద్దం పడుతోంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్, బ్రెజిల్, చైనా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆయా దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో నష్టం తక్కువగా ఉంది. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించారని ప్రపంచమంతా భారత్‌ను ప్రశంసిస్తుంటే..కాంగ్రెస్ తప్పుపడుతోంది.
---ప్రకాశ్ జావడేకర్,కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి