చైనా దుందుడుకు వైఖరిని తప్పుబడుతూ భారత్‌కు మద్దతు తెలిపింది జపాన్. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై స్పందించింది. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.
భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లాతో సమావేశమైన జపాన్ రాయబారి సతోషి సుజుకీ... చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారాలు లభిస్తాయని తమ దేశం విశ్వసిస్తోందని పేర్కొన్నారు.
"విదేశాంగ కార్యదర్శి ష్రింగ్లాతో మంచి సంభాషణ జరిగింది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు, శాంతియుత పరిష్కారానికి భారత ప్రభుత్వం పాటిస్తున్న విధానాలను వివరించినందుకు ధన్యవాదాలు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని జపాన్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. యథాతథ స్థితిని మార్చడానికి చేసే అన్ని ఏకపక్ష ప్రయత్నాలను జపాన్ వ్యతిరేకిస్తుంది."
-సతోషి సుజికీ, జపాన్ రాయబారి
సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జపాన్ రాయబారికి ష్రింగ్లా వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వివాదంపై భారత వైఖరిని తెలియజేసినట్లు సమాచారం.
తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో గత ఏడు వారాలుగా భారత్, చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది సైనికులు అమరులైన తర్వాత సరిహద్దులో పరిస్థితులు మరింత వేడెక్కాయి.
సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉండేలా చైనా సహకరించాలని భారత్ కోరుతోంది. బలగాలను వెనక్కి తరలించి యథాతథ స్థితికి రావాలని డిమాండ్ చేస్తోంది. కానీ చైనా మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. చర్చల్లో శాంతి మంత్రం జపిస్తూనే వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాలు మోహరిస్తోంది.
ఇందుకు ప్రతిగా భారత్ సైతం దీటుగా స్పందిస్తోంది. సైన్యం, వాయుసేనను అప్రమత్తం చేసింది. అవసరమైన ఆయుధాలు, బలగాలను సరిహద్దుకు తరలిస్తోంది.
ఇదీ చదవండి-'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'