జనతా కర్ఫ్యూ: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న రైళ్లు కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఆదివారం చేపట్టనున్న జనతా కర్ఫ్యూలో భాగంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. ఏ పాసింజర్ రైలు కూడా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరబోదని రైల్వేశాఖ స్పష్టంచేసింది.
ఫలితంగా సుమారు 2,400 సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న రైళ్లు మాత్రం గమ్యస్థానం చేరే వరకు అనుమతిస్తారు. దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, సికింద్రాబాద్ సబర్బన్ రైలు సర్వీసులు పరిమితంగానే సేవలు అందించనున్నాయి.
కేటరింగ్ సేవల నిలిపివేత..
మార్చి 22 నుంచి మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆన్‌బోర్డ్ కేటరింగ్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫుడ్ ప్లాజాలు, రీఫ్రెష్‌మెంట్ రూములు, జన ఆహార్, సెల్ కిచెన్లను సైతం మూసివేస్తున్నట్తు తెలిపింది.
పలు సేవలు రద్దు..
- దేశరాజధాని ప్రాంతంలోని గ్రేటర్ నోయిడా మెట్రో సేవలను మార్చి 22న రద్దు చేశారు.
- హిమాచల్ ప్రదేశ్లో ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులపైనా ఆంక్షలు ఉంటాయని ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ స్పష్టం చేశారు.
- బస్సులు, మెట్రో రైలు సేవలను నిలిచిపోతాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
- ప్రధాని పిలుపు నేపథ్యంలో ఆదివారం విమాన సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు గోఎయిర్, విస్తారా ప్రకటించాయి.
- జనతా కర్ఫ్యూలో భాగంగా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయాణ సౌకర్యాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
మోదీ పిలుపు..
కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఆదివారం స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఇంట్లోనే ఉండాలని సూచించారు.
జనతా కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి విషయమై శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు మోదీ. జనతా కర్ఫ్యూకు అన్ని రకాలుగా సహకరిస్తామని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చూడండి:దేశంలో విస్తరిస్తున్న కరోనా కేసులు- ఎక్కడికక్కడ బంద్!