జనతా కర్ఫ్యూను విజయంగా పరిగణించవద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ముగుస్తుందని.. కానీ ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజలు కరోనాపై భారీ స్థాయి ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు.
కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సామర్థ్యం మనవద్ద ఉందని దేశ ప్రజలు నిరూపించారన్నారు. సంకల్పం ఉంటే ఎంతపెద్ద సవాలునైనా ఎదుర్కోగలమని ఉద్ఘాటించారు.
ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి..
కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే ఆదేశాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు మోదీ. ఏ జిల్లాలనైతే మూసివేస్తామని ప్రభుత్వం ప్రకటించిందో ఆయా జిల్లాల ప్రజలు కచ్చితంగా బయటకు రాకూడదని స్పష్టం చేశారు. మిగతా ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప బయట తిరగకూడదన్నారు.
దేశ ప్రజలకు కృతజ్ఞతలు
జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనడం పట్ల దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు మోదీ. సుదీర్ఘ పోరాటానికి కర్ఫ్యూ విజయం తొలి అడుగు అని పేర్కొన్నారు. కరోనాపై విజయం కోసం ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు.
ఇదీ చూడండి:భారత్ బంద్: లాక్డౌన్గా మారిన జనతా కర్ఫ్యూ!