జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్ధు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం జరిగిన తుది, 8వ విడత పోలింగ్లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలి విడతలో 28 స్థానాలకుగానూ 168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితో పాటే 84 సర్పంచ్ స్థానాలకు కూడా శనివారం పోలింగ్ జరిగింది.
22న ఓట్ల లెక్కింపు..
కశ్మీర్లో మొత్తం 280 డీడీసీ స్థానాలకు 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ నవంబరు 28న ప్రారంభమైంది. చివరి దశ శనివారంతో పూర్తయింది. డీడీసీతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా 8 విడతల్లో జరిగాయి. డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆర్టికల్ 370 రద్ధు తర్వాత జరుగుతున్న ఎన్నికలు అయినందున పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బంగాల్లో భాజపాదే అధికారం: సువేందు