జమ్ముకశ్మీర్ శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ ఆర్మీ జవానుతో సహా ఇద్దరు బాలికలను నిర్బంధించారు పోలీసులు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
బిహార్ 17వ రెజిమెంటుకు చెందిన జవాను రోషన్ కుమార్.. తీత్వాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలతో దిల్లీ వెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలికలతో జవానుకు ఉన్న సంబంధమేంటో ఇంకా తెలియరాలేదు.
స్థానిక బాలికలతో ఆర్మీ జవాను పట్టుబడటం 12 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్ 12న అశోక్ కుమార్ అనే జవాను కూడా కొంతమంది బాలికలతో కనిపించగా అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
ఆర్మీ నిబంధనల ప్రకారం.. సిబ్బంది సామాన్య ప్రజానీకంతో మమేకం అయ్యేందుకు అవకాశం లేదు. ఏమైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
2017లో వివాదాస్పద సైనిక అధికారి మేజర్ లీతుల్ గొగొయి.. స్థానికుల్లో భయం కలిగించేందుకు ఓ వ్యక్తిని జీపు ముందు కట్టి తిప్పారు. దీనిపై అప్పట్లో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం.. గొగొయిపై సైన్యం చర్యలు తీసుకుంది.