అయోధ్య ధన్నీపుర్లో నిర్మించే మసీదు రూపకర్తగా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఎస్ఎం అక్తర్ నియమితులయ్యారు. ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టులో తన విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని అక్తర్ వెల్లడించారు.
"ప్రపంచవ్యాప్తంగా నా వద్ద అభ్యసించిన ఆర్కిటెక్టులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. వాళ్లు నాతో కలిసి ఈ ప్రాజెక్టులో భాగమవుతారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తాం. ఇది వారికి గొప్ప అనుభవంగా ఉంటుంది."
- ప్రొఫెసర్ అక్తర్, జామియా మిల్లియా విశ్వవిద్యాలయం
దిల్లీ ప్రభుత్వంతో కలిసి..
విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెంటర్, ఆసుపత్రి తదితర నిర్మాణాలకు అక్తర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. కొన్ని స్థానిక ప్రాజెక్టుల్లోనూ దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యను సందర్శించే అవకాశం లేదని ఆయన అన్నారు. కానీ, ఇంతకుముందే ఆ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు.
15 మంది సభ్యులతో ట్రస్ట్..
అయోధ్య తీర్పులో భాగంగా మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ధన్నీపుర్లోని 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు అందించింది యోగి ప్రభుత్వం. ఇక్కడ మసీదు నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో ఐఐసీఎఫ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది బోర్డు.
మసీదుతో పాటు ఆసుపత్రి, ప్రజా గ్రంథాలయం, ఇండో-ఇస్లామిక్ వారసత్వ సంపద కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.
ఇదీ చూడండి:అయోధ్య వివాదం ఆరంభం నుంచి భూమిపూజ వరకు..