తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుజలాం: ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ - జల్‌శక్తి శాఖ

నీటి ఎద్దడిని తీర్చేందుకు రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు సిద్ధమైంది. దేశంలో నీటి ఎద్దడి నెలకొన్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధికారులను నియమించింది. జులై 1 నుంచి ప్రారంభంకానున్న జల్​శక్తి అభియాన్​లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

ప్రజా ఉద్యమంగా జల సంరక్షణ

By

Published : Jun 27, 2019, 8:27 AM IST

దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్‌ అధికారులను నియమించింది. అదనపు, సంయుక్త కార్యదర్శులు సహా పలువురు ఉన్నతాధికారులను ‘కేంద్ర ప్రభారీ అధికారులు'గా రంగంలోకి దించింది. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ‘జల్‌శక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ)’లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.

డైరెక్టర్‌ లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ స్థాయుల్లో రాష్ట్ర, స్థానిక అధికారులు, భూగర్భ జల నిపుణులు, ఇంజినీర్లతో కూడిన బృందాలతో సమన్వయంగా పనిచేస్తారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. గుర్తించిన బ్లాక్‌లు, జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి.. జల సంరక్షణ తదితర కార్యక్రమాలు సమర్ధంగా అమలయ్యేలా చర్యలు చేపడతాయి.

జల్‌శక్తి అభియాన్‌...

దేశవ్యాప్తంగా జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) జేఎస్‌ఏను అమలు చేయనున్నారు. జల సంపద సృష్టి, చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజా ఉద్యమంగా దీన్ని చేపట్టనున్నారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆయా జిల్లాల్లో.. పరిస్థితి తీవ్రంగా ఉన్న 313 ప్రాంతాలు సహా 1,593 నీటి ఎద్దడి బ్లాక్‌లను గుర్తించారు. ప్రత్యేకించి వేసవిలో, వర్షాభావంతో ఎండిపోయిన వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మేరకు అధికారులు తమ నివేదికలను జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగానికి చెందిన పోర్టల్‌లో సమర్పిస్తారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాల్లో పేర్కొంది.

2024 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు

దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో జల సంక్షోభంపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ తెలియజేశారు. నీటి సంరక్షణకు, భూగర్భ జలాలు తోడెయ్యకుండా కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా దేశంలో నీటి ఎద్దడిపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జలసంరక్షణకు చేపట్టాల్సిన పలు చర్యలను సూచించారు. నదుల అనుసంధానం, జల సంరక్షణకు జిల్లాల వారీగా ప్రణాళికలు, వర్షపు నీటిని ఒడిసిపట్టే పథకాలకు సత్వర అనుమతులు వంటివాటిపై సభ్యులు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులే అజెండా'

ABOUT THE AUTHOR

...view details