కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు దిల్లీలో ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి. యమునా నది తీరం వద్ద ఉన్న నిగంబోధ్ ఘాట్లో జరిగిన అంతిమ సంస్కారాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శ్వాస సంబంధిత సమస్యతో ఈనెల 9న దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు జైట్లీ. శనివారం ఆరోగ్యం క్షీణించి 66ఏళ్ల జైట్లీ తుదిశ్వాస విడిచారు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జైట్లీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి శనివారం కైలాష్నగర్లోని ఆయన నివాసానికి తరలించారు. పార్టీలకు అతీతంగా అనేక మంది అగ్రనేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అనేక మంది ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు... జైట్లీకి నివాళులర్పించడానికి తరలివెళ్లారు.