కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం బాగాలేకపోవడం వల్లే చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోందన్న రాహుల్ గాంధీ విమర్శలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు. అటు శక్తిమంతమైన దేశాలు, ఇటు పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగయ్యాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ను తాము ఎలా కట్టడి చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
కమ్యూనిస్టు చైనా ఇప్పుడే ఎందుకు దాడికి దిగిందో వివరిస్తూ రాహుల్ గాంధీ ఇదివరకే ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో ఇక భారత్ ఏమీ చేయలేదనే చైనా దాడికి దిగిందని రాహుల్ వివరించారు. ఆయన విమర్శలకు జైశంకర్ ఘాటుగా సమాధానం చెప్పారు. వరుసగా ట్వీట్లు చేశారు.
"మా భాగస్వామ్యాలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అమెరికా, రష్యా, ఐరోపా, జపాన్‌తో నిరంతరం సదస్సులు, చర్చలు జరుగుతున్న సంగతిని తెలుసుకోండి. రాజకీయంగా చైనాతో భారత్ సమానంగా వ్యవహరిస్తోంది. విశ్లేషకులను అడిగి తెలుసుకోండి. మేం చాలా స్పష్టంగా, బహిరంగంగా మా అభిప్రాయాలు చెబుతాం. సీపెక్, బెల్డ్ అండ్ రోడ్, దక్షిణ చైనా సముద్రం, ఐరాస నిషేధించిన ఉగ్రవాదులపై స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పాం. మీడియాను అడిగి తెలుసుకోండి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేశాం. 2014-20ని 2008-14 సంవత్సరాల మధ్య పరిస్థితిని పోల్చండి. కేటాయింపులు 280% పెరిగాయి, రహదారుల నిర్మాణం 32%, వంతెనలు 99%, టన్నెల్స్‌ను 6 రెట్లు ఎక్కువగా చేశాం. మన జవాన్లను అడగండీ విషయాల్ని"
-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి