దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కంపెనీలన్నీ తమ ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని జైపుర్లో ఆర్సీ ఎంటర్‌ప్రైజెస్ అనే ఓ ప్రైవేట్ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను ఏర్పాటు చేసింది.
ఆఫీస్ పనిలో భాగంగా ఉద్యోగులు కార్యాలయంలో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడమో లేదా ఇతర ఉద్యోగులను సంప్రదించడమో చేయాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల మధ్య భౌతిక దూరం పాటించడం కష్టమవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆ సంస్థ 7 రోబోలను ఏర్పాటు చేసింది.
రోబోలు చేసే పనులివే!
- రోబోలు దస్త్రాలను ఒకరి నుంచి మరొకరికి చేరవేస్తాయి.
- ముఖ కవళికలను గుర్తించి ఉద్యోగుల హాజరును నమోదు చేస్తాయి.
- సందర్శకుల రాకపోకలను గమనించి, వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయి.
- మాస్కులు ధరించకుండా లోపలికి వస్తే అలారం మోగించే సాంకేతికత కూడా వీటిలో ఉంటుంది.
ఈ రోబోల వినియోగం ద్వారా ఉద్యోగులు పరస్పరం కలిసే అవకాశాలు తగ్గిపోయాయని సంస్థ యంత్రాంగం తెలిపింది. మరిన్ని రోబోలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో రోబోలు సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:కశ్మీర్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం